సకల జనం.. సమైక్య రణం
Published Sun, Dec 8 2013 3:58 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
ఏలూరు, న్యూస్‌లైన్:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ జిల్లాలో ఎగసిన ఆగ్రహ జ్వాలలు శనివారం మిన్నంటాయి. జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగాయి. వైసీపీ, టీడీపీ శ్రేణులతోపాటు సమైక్యవాదులు వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. భీమడోలు మండలం గుండుగొలను వద్ద జాతీయ రహదారిపై మంత్రి పితాని సత్యనారాయణను వైసీపీ నాయకులు, సమైక్యవాదులు అడ్డుకున్నారు. విభజన తీర్మానానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ఓటు వేయూలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ దెందులూరు సమన్వయకర్త పీవీ రావు తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావు చాగల్లులో సెల్ టవర్ ఎక్కి కేంద్రం తీసుకున్న నిర్ణయంపై నిరసన తెలిపారు. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిం చారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు, నాయకులు అంబికా కృష్ణ, బడేటి బుజ్జి పాల్గొన్నారు. జెడ్పీ సెంటర్‌లో ఉపాధ్యాయులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఆశ్రం కళాశాల వద్ద విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. నరసాపురం అంబేద్కర్ సెంటర్ వద్ద సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. న్యాయవాదులు రాస్తారోకో నిర్వహించి కేంద్రప్రభుత్వ తీరును ఎండగట్టారు.
కొనసాగిన బంద్
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో రెండో రోజైన శనివారం కూడా బంద్ చేపట్టారు. పార్టీ నాయకుడు గ్రంధి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దుకాణాలను కార్యకర్తలు మూయించివేశారు. ప్రకాశం చౌక్‌లో ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ నం చేశారు. అంతకుముందు టీడీపీ నాయకులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు మెంటే పార్థసారథి, గాది రాజు బాబు, చింతా శ్రీనివాస్ (బండి శ్రీను), చెల్లబోయిన వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్‌లో సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, అంగర రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సీహెచ్ బాబ్జి తదితరులు పాల్గొన్నారు. నరసాపురం అంబేద్కర్ సెంటర్‌లో దీక్షలు కొనసాగుతున్నాయి. మార్టేరు, ఆచంట సెంటర్లలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కండిబోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. పెనుగొండలో టీడీపీ ఆధ్వర్యంలో బంద్ జరిపారు.
బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బంద్ రెండోరోజూ కొనసాగింది. కొయ్యలగూడెంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా, భారీ ర్యాలీ చేపట్టారు. టి.నరసాపురంలో టీడీపీ శ్రేణులు బంద్ నిర్వహించి, రాస్తారోకో జరి పాయి. జంగారెడ్డిగూడెంలో రెండో రోజు బంద్ విజయవంతమైంది. వైసీపీ ఆధ్వర్యంలో బోసుబొమ్మ సెంటర్‌లో పార్టీ శ్రేణులు మానవహారం, రాస్తారోకో చేపట్టాయి. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు మద్దాల రాజేష్‌కుమార్, కర్రా రాజారావు పాల్గొన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. కామవరపుకోటలో టీడీపీ ఆధ్వర్యంలో బంద్ చేశారు. కొవ్వూరులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. నాయకులు వర్రే శ్రీనివాస్, వరిఘేటి సుధాకర్ ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్ల ర్యాలీ చేశారు. చాగల్లు మండలం ఊనగట్లలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ సెంటర్‌లో నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి ఆధ్వర్యంలో రోడ్డు బైఠాయించి నిరసన తెలిపారు. టీడీపీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడు వద్ద విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఉండిలో బంద్ నిర్వహించి, సెంటర్‌లో రాస్తారోకో చేశారు. తణుకులో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. జాతీయ రహదారిని దిగ్బంధించారు. నల్లజర్లలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో బంద్ చేపట్టి, రాస్తారోకో చేశారు. దేవరపల్లిలో టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Advertisement
Advertisement