ప్రకాశ్‌నగర్ (రాజమండ్రి) : రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను ఎండగట్టేందుకు అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా కోరారు. స్థానిక గణేష్ చౌక్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట, అలాగే అన్ని మండల కేంద్రాల్లో బుధవారం ఉదయం 11 గంటలకు ధర్నా జరుగుతుందన్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని రాజా పిలుపునిచ్చారు.
ఆధిపత్యం కోసం రోడ్డెక్కుతున్నారు
రాజమండ్రి విషయం చూస్తే ఇక్కడి ప్రజాప్రతినిధులు రోడ్డెక్కి కొట్టుకుంటున్నారని, ఆధిపత్య పోరు కోసం ప్రజా సమస్యలను పక్కనపెట్టేస్తున్నారని విమర్శించారు. సాఫీగా సాగాల్సిన ఇసుక ర్యాంపుల వ్యవహారంలో ప్రజాప్రతినిధుల జోక్యం ఏంటంటూ ప్రశ్నించారు. పుష్కరాల సమయం తరుముకొస్తున్నా... వాటి గురించి ఎవరూ ఆలోచన చేయడం లేదన్నారు.
వచ్చే నెల 6న కలెక్టరేట్ ఎదుట ధర్నా
చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 6న జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయనున్నట్టు రాజా తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలను వేదికగా చేసుకుని 2015 జనవరి 6, 7 తేదీల్లో అధినేత జగన్ మోహన్‌రెడ్డి రిలే నిరాహార దీక్షలు చేస్తారని వివరించారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కొత్త కార్యవర్గాలు వేస్తామన్నారు. ఎవరికీ ఇబ్బంది లేని ప్రాంతంలో రాజమండ్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని, రాజమండ్రి అర్బన్ జిల్లాకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు. అనారోగ్యం కారణంగా రాజమండ్రి సిటీ కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ ఏడాది పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారని విలేకర్లు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నగరపాలక సంస్థలో వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్ బొంత శ్రీహరి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, పార్టీ నాయకుడు మాసా రామ్‌జోగ్ పాల్గొన్నారు.
ధర్నాను విజయవంతం చేయండి
Published Wed, Nov 5 2014 12:21 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement