కాంగ్రెస్, టీడీపీల కోవర్టు
రఘురామకృష్ణంరాజుపై వైఎస్సార్‌సీపీ నేతల ధ్వజం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా, కాంగ్రెస్, టీడీపీల కోవర్టులా పనిచేసినందువల్లే నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి రఘురామకృష్ణంరాజును తప్పించినట్లు పార్టీ నేతలు ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, సర్రాజు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలకు రఘురామలాంటి వ్యక్తులు సహాయపడుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం వారు మీడియాతో మాట్లాడారు. రఘును పార్టీ బాధ్యతల నుంచి తప్పించగానే దివాలాకోరు వ్యాఖ్యలతో జగన్‌పై బురదచల్లుతున్నారని దుయ్యబట్టారు. జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చూస్తుంటే ఆయన స్క్రిప్టు ఎక్కడిదో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. జగన్ పనితీరు, నాయకులను కలుపుకునే విధానం పార్టీ పెట్టినప్పటి నుంచి తమకు, నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజానీకానికి తెలుసునన్నారు. పార్టీలో చేరి 90 రోజులు కూడా లేని రఘులాంటి వ్యక్తి జగన్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తే ఏ ఒక్క కార్యకర్తా సహించరని హెచ్చరించారు. ఏ పార్టీలో చేరినా ఆయనకు నర్సాపురం ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెబుతారని శేషుబాబు, సర్రాజు హెచ్చరించారు.
ప్రసాదరాజు ఏమన్నారంటే...
కాంగ్రెస్, టీడీపీలకు కోవర్టులా పనిచేస్తున్న రఘును లోక్‌సభ నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించాలన్న జిల్లా నేతల విజ్ఞప్తి మేరకే పార్టీ అధినేత జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న నాయకులను పక్కన పెట్టాలని జగన్‌పై రఘు తీవ్ర ఒత్తిడి చేశారు. కానీ మా నాయకుడు మాలాంటి వారి పక్షాన నిలిచినందుకు సహించలేక ఆరోపణలు చేస్తున్నారు.
నిన్నటివరకు జగన్ ఇంద్రుడు, చంద్రుడని రఘు చెప్పారు. రాష్ట్ర విభజనకు కారణం కిరణ్, చంద్రబాబులే అని మాట్లాడారు. ఒక్క రోజులోనే మార్పు వచ్చిందా? పార్టీ నుంచి బయటకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో సూటిగా చెప్పగలరా? జగన్ విభజనవాదంటూ వితండవాదం చేస్తున్న ఆయనకు, తాను చేరబోయే బీజేపీ, టీడీపీలు సమైక్య పార్టీలుగా కనిపిస్తున్నాయా?
రఘు నన్ను కలవలేదు: వెంకయ్యనాయుడు
రఘురామకృష్ణంరాజు గురువారం తనను కలసినట్టు వచ్చిన వార్తలను బీజేపీ నేత వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. రఘురామ తన ఇంటికి అల్పాహార విందుకు రాలేదని, వాస్తవానికి తాను హైదరాబాద్‌లోనే లేనని తెలిపారు. తాను విజయవాడ నుంచే బెంగుళూరు వెళ్లానని, ప్రస్తుతం అక్కడే ఉన్నానని పేర్కొన్నారు.
రఘురామకృష్ణంరాజుకు స్వస్తి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న వ్యాపార వేత్త రఘురామ కృష్ణంరాజును ఆ బాధ్యతల నుంచి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తప్పించారు. రఘురామ కృష్ణంరాజు వ్యవహారశైలి మీద ఆ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సమన్వయకర్తల నుంచి అందిన ఫిర్యాదుల దృష్ట్యా... జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.