
ఏలూరు /పెనుగొండ: నాలుగున్నర సంవత్సరాల టీడీపీ పాలనలో కార్యకర్త స్థాయి నుంచి సీఎం వరకూ అవినీతితో రాష్ట్రాన్ని దోపిడీ చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో బుధవారం జరిగిన బూత్ కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో దోపిడీ చేసిన సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేసి తిరిగి అధికారంలోకి రావడానికి టీడీపీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. 2014 ఎన్నికల సమయంలో 600 మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
ప్రత్యేక హోదాను స్వలాభం కోసం తాకట్టు పెట్టి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారన్నారు. బీజేపీ, టీడీపీ రెండూ ప్రజలను మోసం చేశాయన్నారు. ప్రజా సంక్షేమం కోసం జగన్‌మోహన్‌రెడ్డి రోజుకు నాలుగైదు వేల మంది సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకొంటున్నారని అన్నారు. ఇదే స్ఫూర్తితో నవరత్నాలతో వారి సమస్యలు పరిష్కరించడానికి హామీ ఇచ్చారన్నారు. వీటితో ఒక్కో కుటుంబానికి లక్ష నుంచి రూ.5 లక్షల వరకూ లబ్ధి చేకూరుతుందన్నారు. ఆచంట నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చెరుకువాడ శ్రీరంగనాథరాజు వినూత్న రీతిలో చేపట్టిన సర్వే అమోఘమని సుబ్బారెడ్డి అభినందించారు.
ఆచంట సమన్వయకర్త శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ ఆచంట నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. పోడూరు మండలం తూర్పుపాలెంకు చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సమావేశంలో నర్సాపురం, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తలు ముదునూరి ప్రసాదరాజు, కవురు శ్రీనివాస్, విద్యావేత్త డాక్టర్ గుబ్బల తమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment