వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఖాయం
♦ పార్టీ కార్యక్రమాలకు మహిళాదరణే దీనికి సంకేతం
♦ టీడీపీ సర్కారు మోసాలేమిటో ప్రజలకు తెలుసు
♦ మోదీ దగ్గర చంద్రబాబు గౌరవం కోల్పోయారు
♦ వైఎస్‌ఆర్‌సీపీ శ్రీకాకుళం ప్లీనరీ సమావేశంలో ధర్మాన ప్రసాదరావు
సాక్షి ప్రతినిధి– శ్రీకాకుళం: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పార్టీ ప్లీనరీలు సహా జిల్లాలో పార్టీ కార్యక్రమం ఏదైనా ప్రజలు భారీ సంఖ్యలో ఉప్పొంగుతున్నారని, వీరిలో అధిక శాతం మహిళలు హాజరవుతుండటమే దీని కొక సంకేతమని వివరించారు. శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న ఆనందసాయి ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గ ప్లీనరీ సమావేశం జరిగిం ది.
ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలతో అన్ని వర్గాల ప్రజలు విసిగెత్తిపోయి ఉన్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓడించేందుకు ఉవ్వి ళ్లూరుతున్నారని చెప్పారు. కార్యకర్తలంతా గ్రామస్థాయి నుంచే గళమెత్తాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని సూచించారు. గత మూడేళ్ల పదవీకాలంలో చంద్రబాబు దొంగ వ్యవహారాలు తారస్థాయికి చేరాయని విమర్శించారు. అందువల్లే కేంద్ర ప్రభుత్వం వద్ద, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్ద ఆయన గౌరవం కోల్పోయారని చెప్పారు. బహుశా ఇలాంటి కారణాల వల్లనేమో ఏడాదిగా మోదీ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వట్లేదన్నారు.
రాష్ట్ర విజభన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా చంద్రబాబు స్వీయలబ్ధి కోసమే దాన్ని చేజిక్కించుకున్నారని ధర్మాన ధ్వజమెత్తారు. చివరకు ప్రాజెక్టు కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండుకు సైతం నీళ్లొదిలేశారని విమర్శించారు. రాజధాని అమరావతి విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షం సహా మరే రాజకీయ పక్షంతోనూ సంప్రదించకుండానే నిర్ణయాలు తీసేసుకుంటున్నారన్నారు. 1600 ఎకరాల కోర్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా మార్కెట్ విలువ రూ.10 కోట్లు వరకూ ఉంటుందన్నారు. కానీ సింగపూర్ ప్రభుత్వానికి సంబంధంలేని ఆ దేశ ప్రైవేట్ సంస్థలకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారని విమర్శించారు.
అవి కేవలం రూ.320 కోట్లు పెట్టుబడి పెడితే 58 శాతం వాటా ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం రూ. 21 వేల కోట్ల మేర పెట్టుబడి పెడితే 48 శాతం వాటా ఇవ్వడం వెనుక అంతరార్థమేమిటో చంద్రబాబుకే తెలియాలన్నారు. తన సొంత కంపెనీ హెరిటేజ్ సంస్థ విషయంలోనైతే ఇలాగే చేస్తారా? అన్ని ప్రశ్నిం చారు. తనకే కోరికా, ఆశా లేదని పదేపదే చెప్పుకొనే ఆయనే ఎప్పటికీ తానే ముఖ్యమంత్రి పదవిలో ఉండాలనుకోవడాన్ని ఏమంటారో చెప్పాలన్నారు.
దోపిడీయే లక్ష్యంతో చెలరేగిపోతున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలకు మళ్లీ పెద్దపీట వేయాలంటే జగన్ నాయకత్వంలో రాజన్న రాజ్యం తెచ్చుకోవాల్సిందేన్నారు. పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురా లు రెడ్డి శాంతి మాట్లాడుతూ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మద్యం మాఫియాలో కూరుకుపోయార ని విమర్శించారు. జయంతికి, వర్థంతికి తేడా తెలియ ని నారా లోకేశ్‌కు ప్రజా నేత జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేసే అర్హత లేదన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతి నిధి చెల్లుబోయిన వేణు, విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్ పాల్గొన్నారు.