తెలంగాణకు వ్యతిరేకం కాదు
Published Wed, Aug 28 2013 12:21 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణకు వ్యతిరేకం కాదని పార్టీ రంగారెడ్డి జిల్లా నేతలు స్పష్టం చేశారు. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ నేతలు దుష్ర్పచారం చేస్తున్నారని దుయ్య బట్టారు. తెలంగాణలో వైఎస్సార్ సీపీ లేదంటూ కొందరు నాయకులు దుష్ర్పచారం చేస్తున్నారని, అదంతా పూర్తి అవాస్తవమన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం రంగారెడ్డి జిల్లాకు చెందిన పార్లమెంటు పరిశీ లకులు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర నేతలు భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియా తో మాట్లాడారు. తెలంగాణలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ బలంగా ఉందని, కార్యకర్తలందరూ పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేశారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానించే నాయకులు, ప్రజలు తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పారు. వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఎక్కువగా లబ్ధిపొందింది ఎక్కువగా తెలంగాణ ప్రాంతంవారేనన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన దీక్షకు తామంతా సంఘీభావం తెలుపుతున్నట్లు వివరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మల్కాజిగిరి పార్లమెంటు పరిశీలకుడు జంపన ప్రతాప్, ఉప్పల్ అసెంబ్లీ సమన్వయకర్త, కార్పొరేటర్ ధన్‌పాల్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సమన్వయకర్త శేఖర్‌గౌడ్ (మామ), రంగారెడ్డి జిల్లా యువజన విభాగం కన్వీనర్, కార్పొరేటర్ జి.సురేష్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ కె.అమృతసాగర్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
Advertisement