Ranga Reddy District leaders
-
కాంగ్రెస్‌లో సరిహద్దుల లొల్లి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతల మధ్య సరిహద్దుల పంచాయతీ పతాకస్థాయికి చేరింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లపై పెత్తనాన్ని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్‌కు ఎలా అప్పగిస్తారని రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలు ప్రశ్నిస్తున్నారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన డివిజన్లపై దానంకు పెత్తనం అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీలో ఇక తామెందుకని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డిని నిలదీస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యతలో దానం నాగేందర్ జోక్యం చేసుకుంటే పార్టీని వీడటానికి కూడా వెనుకాడబోమని హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి తలలు పట్టుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 150 డివిజన్లు ఉండగా రంగారెడ్డి జిల్లా పరిధిలో 43 డివిజన్లు ఉంటాయి. హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలోని డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను ఆయా నియోజకవర్గాల ఇన్చార్జీలు, రంగారెడ్డి డీసీసీ నిర్వహించాలని వీరు కోరుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌కు, రంగారెడ్డి జిల్లాల మధ్య ‘పెత్తనం’ పంచాయతీ ఇప్పటికే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో జరిగింది. దీనిని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో చర్చించి పరిష్కరించాలంటూ టీపీసీసీని దిగ్విజయ్‌సింగ్ ఆదేశించారు. అయితే దానం టీఆర్ఎస్లో చేరాలని ఏర్పాట్లు చేసుకోవడం, ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దగా పట్టించుకోకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతల మధ్య పంచాయతీ మరింత పెరిగింది. కాంగ్రెస్‌పార్టీని విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకుని, చివరలో ఆగిపోయిన దానంకు తమ డివిజన్లలో పార్టీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఎలా అప్పగిస్తారని రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, ఆ జిల్లా నేతలు డి.సుధీర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, బండారు లక్ష్మా రెడ్డి, నందికంటి శ్రీధర్, బిక్షపతి యాదవ్ తదితరులు ఉత్తమ్‌ను, జానాను కలిసి తమ అభిప్రాయాన్ని తెగేసి చెప్పారు. ఏదేమైనా తమ నియోజకవర్గాల్లోని డివిజన్లలో దానం నాగేందర్ జోక్యాన్ని, పెత్తనాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. జానారెడ్డిని, ఉత్తమ్‌కుమార్ రెడ్డిని గురువారం రాత్రి వీరు కలిశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని డివిజన్లలో తమకే నిర్ణయాధికారం ఉండాలని కోరారు. తమను పట్టించుకోకుంటే పార్టీని వీడటానికి కూడా వెనుకాడేది లేదని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు వీరిని హెచ్చరించినట్టుగా తెలిసింది. -
గ్రేటర్ నుంచి వేరు చేయండి
* దిగ్విజయ్‌ను కోరిన రంగారెడ్డి జిల్లా నేతలు * జిల్లాకు పార్టీ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి * దానం పనితీరుపై నేతల ఫిర్యాదు * పొమ్మన లేక పొగబెడుతున్నారన్న దానం * గ్రేటర్ సమీక్షలో నాయకుల వాగ్బాణాలు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ నుంచి తమ నియోజకవర్గాలను విడదీసి, జిల్లాకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని రంగారెడ్డి జిల్లా నేతలు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు విన్నవించారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ పనితీరు, గ్రేటర్ ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహంపై దిగ్విజయ్‌సింగ్ గురువారం గాంధీభవన్‌లో సమీక్ష నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్, ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పరస్పరం వాగ్బాణాలు సంధించుకున్నారు. కమిటీ విభజనపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, అప్పటిదాకా ఐక్యంగా ఉండాలని దిగ్విజయ్ సింగ్ సూచించారు. దానం పనితీరు బాగాలేదని ఫిర్యాదు దానం నాగేందర్ పనితీరు బాగాలేదని, 40 శాతానికి పైగా ఓట్లను జాబితా నుంచి తొలగిస్తున్నా పట్టించుకోవడం లేదని పలువురు నేతలు దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని పలు నియోజక వర్గాలు, వార్డులు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయని, వాటి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆ జిల్లా నేతలు కోరారు. హైదరాబాద్ పరిధి విస్తృతంగా పెరిగిందని, 28 నియోజకవర్గాల్లో పార్టీని నడిపించడం గ్రేటర్ కమిటీకి సాధ్యంకావడం లేదన్నారు. అయితే జీహెచ్ఎంసీ ప్రాంత మంతా ఒకటే కమిటీ ఉండాలని హైదరాబాద్ నేతలు కోరారు. దీనిపై నేతలు కాసేపు వాదించుకున్నారు. కార్పొరేటర్ టికెట్లు ఇప్పిస్తామంటూ కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని, స్కూటర్లపై తిరిగే వారు ఇప్పుడు ఆడి కార్లలో తిరుగుతున్నారని నాయకుడు సిరాజుద్దీన్ ఆరోపించారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్‌తో దానంకు సాన్నిహిత్యం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే మేరీ రవీంద్రనాథ్ అన్నారు. మంత్రి పద్మారావు గౌడ్ ఇటీవలే దానం ఇంటికి వెళ్లిన విషయాన్ని మరో నాయకుడు ప్రస్తావించారు. ఓటర్లను తొలగిస్తే గ్రేటర్ హైదరాబాద్ కమిటీ పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో పార్టీని రెండుగా విభజించాలని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సూచించారు. ఎన్నో త్యాగాలు చేశా: దానం భేటీలో దానం నాగేందర్ మాట్లాడుతూ.. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశానన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలపై తనకు సమాచారం ఉండటం లేదన్నారు. ఓటర్ల తొలగింపు వంటి చిన్నచిన్న అంశాలతో సమావేశాలు పెట్టుకుంటున్నారని విమర్శిం చారు. టికెట్ల కోసం డబ్బులు తీసుకున్నట్టుగా ఒక్కరు నిరూపించినా ఎలాంటి శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. పార్టీ మారుతున్నానంటూ తనపై కొందరు పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సమావేశంలో అంజన్‌కుమార్ యాదవ్, సుధీర్ రెడ్డి, క్యామ మల్లేశం, మల్రెడ్డి రంగారెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, భిక్షపతి యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణకు వ్యతిరేకం కాదు
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణకు వ్యతిరేకం కాదని పార్టీ రంగారెడ్డి జిల్లా నేతలు స్పష్టం చేశారు. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ నేతలు దుష్ర్పచారం చేస్తున్నారని దుయ్య బట్టారు. తెలంగాణలో వైఎస్సార్ సీపీ లేదంటూ కొందరు నాయకులు దుష్ర్పచారం చేస్తున్నారని, అదంతా పూర్తి అవాస్తవమన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం రంగారెడ్డి జిల్లాకు చెందిన పార్లమెంటు పరిశీ లకులు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర నేతలు భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియా తో మాట్లాడారు. తెలంగాణలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ బలంగా ఉందని, కార్యకర్తలందరూ పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానించే నాయకులు, ప్రజలు తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఎక్కువగా లబ్ధిపొందింది ఎక్కువగా తెలంగాణ ప్రాంతంవారేనన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేపట్టిన దీక్షకు తామంతా సంఘీభావం తెలుపుతున్నట్లు వివరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మల్కాజిగిరి పార్లమెంటు పరిశీలకుడు జంపన ప్రతాప్, ఉప్పల్ అసెంబ్లీ సమన్వయకర్త, కార్పొరేటర్ ధన్‌పాల్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సమన్వయకర్త శేఖర్‌గౌడ్ (మామ), రంగారెడ్డి జిల్లా యువజన విభాగం కన్వీనర్, కార్పొరేటర్ జి.సురేష్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ కె.అమృతసాగర్ ఇతర నాయకులు పాల్గొన్నారు.