కాంగ్రెస్‌లో సరిహద్దుల లొల్లి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతల మధ్య సరిహద్దుల పంచాయతీ పతాకస్థాయికి చేరింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లపై పెత్తనాన్ని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్‌కు ఎలా అప్పగిస్తారని రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలు ప్రశ్నిస్తున్నారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన డివిజన్లపై దానంకు పెత్తనం అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీలో ఇక తామెందుకని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డిని నిలదీస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యతలో దానం నాగేందర్ జోక్యం చేసుకుంటే పార్టీని వీడటానికి కూడా వెనుకాడబోమని హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి తలలు పట్టుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 150 డివిజన్లు ఉండగా రంగారెడ్డి జిల్లా పరిధిలో 43 డివిజన్లు ఉంటాయి. హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలోని డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, రంగారెడ్డి డీసీసీ నిర్వహించాలని వీరు కోరుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌కు, రంగారెడ్డి జిల్లాల మధ్య ‘పెత్తనం’ పంచాయతీ ఇప్పటికే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో జరిగింది. దీనిని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో చర్చించి పరిష్కరించాలంటూ టీపీసీసీని దిగ్విజయ్‌సింగ్ ఆదేశించారు. అయితే దానం టీఆర్‌ఎస్‌లో చేరాలని ఏర్పాట్లు చేసుకోవడం, ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దగా పట్టించుకోకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతల మధ్య పంచాయతీ మరింత పెరిగింది.
కాంగ్రెస్‌పార్టీని విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకుని, చివరలో ఆగిపోయిన దానంకు తమ డివిజన్లలో పార్టీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఎలా అప్పగిస్తారని రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, ఆ జిల్లా నేతలు డి.సుధీర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, బండారు లక్ష్మా రెడ్డి, నందికంటి శ్రీధర్, బిక్షపతి యాదవ్ తదితరులు ఉత్తమ్‌ను, జానాను కలిసి తమ అభిప్రాయాన్ని తెగేసి చెప్పారు.
ఏదేమైనా తమ నియోజకవర్గాల్లోని డివిజన్లలో దానం నాగేందర్ జోక్యాన్ని, పెత్తనాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. జానారెడ్డిని, ఉత్తమ్‌కుమార్ రెడ్డిని గురువారం రాత్రి వీరు కలిశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని డివిజన్లలో తమకే నిర్ణయాధికారం ఉండాలని కోరారు. తమను పట్టించుకోకుంటే పార్టీని వీడటానికి కూడా వెనుకాడేది లేదని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు వీరిని హెచ్చరించినట్టుగా తెలిసింది.