బీఆర్‌ఎస్ సభ్యులనుద్దేశించి సంయమనం కోల్పోయిన ఎమ్మెల్యే దానం
మైక్ ఆన్‌లో ఉండగానే అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో శుక్రవారం ఎమ్మెల్యే దానం నాగేందర్ సంయమనం కోల్పోయారు. బీఆర్‌ఎస్ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో మైక్ ఆన్‌లో ఉండడంతో శాసనసభ ప్రత్యక్ష ప్రసారంలో వెళ్లడం, సభలో వినిపించడంతో గందరగోళానికి దారితీసింది.
అసలు ఏం జరిగిందంటే..
హైదరాబాద్‌లో సుస్థిర అభివృద్ధి అంశంపై స్పీకర్ లఘు చర్చను ప్రారంభించి దానం నాగేందర్‌కు మైక్ ఇచ్చారు. నాగేందర్ మాట్లాడటం ప్రారంభించగానే.. ఆయన వైపు తిరిగి ‘నువ్వు ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావు’అంటూ బీఆర్‌ఎస్ సభ్యులు గట్టిగా నిలదీశారు. నాగేందర్ ఇవేమీ పట్టించుకోకుండా మాట్లాడుతుండగా, వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పదేపదే ప్రశ్నించటంతో నాగేందర్ తీవ్ర అసహనానికి గురయ్యారు.
ఆ క్రమంలోనే సహనం కోల్పోయి.. ‘నన్ను ఏయ్ అంటారా’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు మళ్లీ నాగేందర్‌ను ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావంటూ నిలదీయటంతో.‘ఏయ్ మూసుకో రా..నీయమ్మ.. తోలు తీస్తా కొడుకా ఒక్కొక్కరిది.. నీ యమ్మ బయట కూడా తిరగనీయరా. ఏం అనుకుంటున్నార్రా మీరు...తోలు తీస్తా...బయట కూడా తిరగనియ్య.. రారా.’అంటూ మాట్లాడటంతో సభ్యులంతా విస్తుపోయారు.
వెంటనే మేల్కొన్న కాంగ్రెస్ సభ్యులు నాగేందర్ వద్దకు వచ్చి మైక్ ఆన్‌లో ఉందని, అలా మాట్లాడొద్దని సూచించారు. ఇంతలో కొందరు బీఆర్‌ఎస్ సభ్యులు నాగేందర్ వైపు దూసుకొచ్చి తమను బూతులు తిడతావా అంటూ నిలదీశారు. రండిరా చూసుకుందాం.. అంటూ నాగేందర్ కూడా వారితో బాహాబాహికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ సభ్యులు ఆయన్ను నిలువరించారు. అటువైపు బీఆర్‌ఎస్ సభ్యులను వారి పార్టీ, కాంగ్రెస్ సభ్యులు కొందరు ఆపి వెనక్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత దానం తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా సభలోనే ఏవో కాగితాలు చదువుతూ ఉండిపోయారు.
ఖండించిన అక్బరుద్దీన్
సభ వెలుపల ఉన్న మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ వెంటనే సభలోకి వచి్చ. దానిపై స్పందించారు. సీనియర్ సభ్యుడైన దానం నాగేందర్ సభలో అన్‌పార్లమెంటరీ పదాలు వాడడం ఏమాత్రం సబబు కాదని, సభకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశా>రు. బీఆర్‌ఎస్ సభ్యులు కూడా అన్‌పార్లమెంటరీ పదాలు వాడుతూ తనను మాట్లాడనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఆ సందర్భంలో తాను ఆగ్రహం వ్యక్తం చేశానని, కావాలని అలాంటి పదాలు ఉచ్ఛరించలేదని, దానిపై ఎవరికైనా బాధ కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నానని దానం పేర్కొన్నారు.
ఆ వ్యాఖ్యలను పరిశీలించి రికార్డుల్లో నుంచి తొలగించే విషయమై నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ పేర్కొన్నారు. అయి తే, తాను మాట్లాడింది హైదరాబాద్ నగర మాండలికంలో భాగమేనంటూ దానం నాగేందర్ పేర్కొనటం కొసమెరుపు. మాట్లా డేందుకు మైక్ ఇవ్వాలని స్పీకర్‌ను బీఆర్‌ఎస్ సభ్యులు అడగ్గా ఆయన ఇవ్వలేదు. దీంతో బీఆర్‌ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment