గ్రేటర్ నుంచి వేరు చేయండి
* దిగ్విజయ్‌ను కోరిన రంగారెడ్డి జిల్లా నేతలు
* జిల్లాకు పార్టీ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
* దానం పనితీరుపై నేతల ఫిర్యాదు
* పొమ్మన లేక పొగబెడుతున్నారన్న దానం
* గ్రేటర్ సమీక్షలో నాయకుల వాగ్బాణాలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ నుంచి తమ నియోజకవర్గాలను విడదీసి, జిల్లాకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని రంగారెడ్డి జిల్లా నేతలు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు విన్నవించారు.
గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ పనితీరు, గ్రేటర్ ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహంపై దిగ్విజయ్‌సింగ్ గురువారం గాంధీభవన్‌లో సమీక్ష నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్, ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పరస్పరం వాగ్బాణాలు సంధించుకున్నారు. కమిటీ విభజనపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, అప్పటిదాకా ఐక్యంగా ఉండాలని దిగ్విజయ్ సింగ్ సూచించారు.
దానం పనితీరు బాగాలేదని ఫిర్యాదు
దానం నాగేందర్ పనితీరు బాగాలేదని, 40 శాతానికి పైగా ఓట్లను జాబితా నుంచి తొలగిస్తున్నా పట్టించుకోవడం లేదని పలువురు నేతలు దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని పలు నియోజక వర్గాలు, వార్డులు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నాయని, వాటి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆ జిల్లా నేతలు కోరారు. హైదరాబాద్ పరిధి విస్తృతంగా పెరిగిందని, 28 నియోజకవర్గాల్లో పార్టీని నడిపించడం గ్రేటర్ కమిటీకి సాధ్యంకావడం లేదన్నారు.
అయితే జీహెచ్‌ఎంసీ ప్రాంత మంతా ఒకటే కమిటీ ఉండాలని హైదరాబాద్ నేతలు కోరారు. దీనిపై నేతలు కాసేపు వాదించుకున్నారు. కార్పొరేటర్ టికెట్లు ఇప్పిస్తామంటూ కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని, స్కూటర్లపై తిరిగే వారు ఇప్పుడు ఆడి కార్లలో తిరుగుతున్నారని నాయకుడు సిరాజుద్దీన్ ఆరోపించారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్‌తో దానంకు సాన్నిహిత్యం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే మేరీ రవీంద్రనాథ్ అన్నారు.
మంత్రి పద్మారావు గౌడ్ ఇటీవలే దానం ఇంటికి వెళ్లిన విషయాన్ని మరో నాయకుడు ప్రస్తావించారు. ఓటర్లను తొలగిస్తే గ్రేటర్ హైదరాబాద్ కమిటీ పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీలో పార్టీని రెండుగా విభజించాలని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సూచించారు.
ఎన్నో త్యాగాలు చేశా: దానం
భేటీలో దానం నాగేందర్ మాట్లాడుతూ.. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశానన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలపై తనకు సమాచారం ఉండటం లేదన్నారు. ఓటర్ల తొలగింపు వంటి చిన్నచిన్న అంశాలతో సమావేశాలు పెట్టుకుంటున్నారని విమర్శిం చారు. టికెట్ల కోసం డబ్బులు తీసుకున్నట్టుగా ఒక్కరు నిరూపించినా ఎలాంటి శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. పార్టీ మారుతున్నానంటూ తనపై కొందరు పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సమావేశంలో అంజన్‌కుమార్ యాదవ్, సుధీర్ రెడ్డి, క్యామ మల్లేశం, మల్‌రెడ్డి రంగారెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, భిక్షపతి యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.