
‘దమ్ముంటే రా.. పోటీ చేసి గెలువు’
గుంటూరు: ఎమ్మెల్యే అఖిలప్రియపై జరగని దాడిని జరిగినట్లుగా టీడీపీ నేతలు అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఎంతో ముఖ్యమైన రైతుల సమస్యలను పక్కదారి పట్టించేందుకు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటన జరిగినప్పుడు తాను అక్కడే ఉన్నానని, ఎలాంటి దాడిగాని, గొడవగాని అసలు జరగలేదని స్పష్టం చేశారు.
అసలు దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని, అలాంటి నైజం కూడా తమది కాదని అంబటి చెప్పారు. ఎనిమిదిమంది వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చింతమనేని అధికారులపై దాడి చేస్తే సీఎం వత్తాసు పలికారని, ఎమ్మెల్సీ సతీశ్ టూరిజం సిబ్బందిపై దాడి చేసినా కేసు పెట్టేందుకు వెనుకాడారని, అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి కాంట్రాక్టర్లను బెదిరించినా కేసు పెట్టలేదని అలాంటిది తమ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. భూమా నాగిరెడ్డికి దమ్ముంటే ఆయన, అఖిలప్రియ రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు.
నంద్యాలకు రమ్మని సవాల్ విసిరారని కచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాలకు వస్తారని స్పష్టం చేశారు. 2015 డిసెంబర్‌లో పంటకు నిప్పు పెట్టిన ఘటనలో ఇప్పటి వరకు ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదని నిలదీశారు. ఫ్యాన్సీ నెంబర్ కోసం టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, ఈ ఘటన చిత్రించిన విలేకరిని అసభ్య పదజాలంతో దూషించారని గుర్తు చేశారు. అలాంటివారిపై కేసులు పెట్టకుండా ప్రజల తరుపున నిలబడ్డ విపక్ష నేతలను, కార్యకర్తలను వేధించడం దారుణం అని అంబటి అన్నారు.