రైతులను ఆదుకోవడంలో ఘోర వైఫల్యం
చంద్రబాబుపై ధ్వజమెత్తిన బొత్స
సాక్షి, హైదరాబాద్: ఓవైపు కరవు, మరో వైపు పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆంధ్రప్రదేశ్‌లో రైతాంగం అల్లాడుతూ ఉంటే వారిని ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఎన్డీయే సమావేశాలకు వెళ్లి అక్కడ ఎన్డీయే తరఫున మీడియా సమావేశాల్లో మాట్లాడటం ఆపి ప్రజా సమస్యలను పట్టించుకోవాలన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు సఖ్యతగా ఉన్నందువల్ల, ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం వల్ల రాష్ట్రానికి, రైతుకు ఏం ఒరిగిందని సూటిగా ప్రశ్నించారు.
కేంద్రంతో స్నేహంగా ఉండటంలో తప్పులేదని, దానివల్ల రాష్ట్రానికి మేలు జరగాలని చెప్పారు. పంటలకు మద్దతు ధర కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేవీ కనుచూపు మేరలో కన్పించడం లేదని విమర్శించారు. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ ఫండ్‌ను ఏర్పాటు చేసి తక్షణం మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ జరిగినపుడు టీడీపీ ఎంపీలు సభలోనే ఉన్నా తమ నోళ్లకు ప్లాస్టర్లు వేసుకున్నారా? అని సూటిగా ప్రశ్నించారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీలు వ్యవహరించిన తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.