
‘తెలుగుదేశం పార్టీకి సంస్కారమే లేదు’
► అసెంబ్లీలోనే ప్రతిపక్ష నేత అంతుచూస్తానన్న మాటలు ఏమయ్యాయ్?
►మాటల యుద్ధం కన్నా.. ప్రజా పోరాటంలో తేల్చుకుందాం
►స్థాయి మరిచి విమర్శలు చేయడం ఎమ్మెల్యే అనితకు తగదు
►వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు ధ్వజం
డాబాగార్డెన్స్: ముఖ్యమంత్రి చంద్రబాబుకు, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సంస్కారమే లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు విమర్శించారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రతిపక్ష నేత అంతు చూస్తానన్న మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. జగదాంబ జంక్షన్ సమీపంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోటి జనాభా గల దళిత జాతిని అవమానించినప్పుడు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని, దళిత మంత్రులు, అధికార పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలు ఏం చేశారని ప్రశ్నించారు.
పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డిని చెప్పుతీసి కొడతానంటే మీలో ఎవరైనా క్షమాపణ చెప్పారా? అలాంటి మీకు, మీ పార్టీకి సంస్కారం ఎక్కడదని? దుయ్యబట్టారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయినా కనీసం వారి కుటుంబాలను పరామర్శించని సంస్కారం టీడీపీదని ఎద్దేవ చేశార. చంద్రబాబు కళ్లు ఉన్న దృతరాష్ట్ర పాలన సాగిస్తున్నారని విమర్శించారు. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆలోచన అంతా బడుగు, బలహీన వర్గాలతో పాటు అందరి కోసం ఉండేదని, చంద్రబాబు మైండ్‌సెట్ అందుకు విరుద్ధమన్నారు.
పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత స్థాయిని మరచి ప్రతిపక్ష నేతపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే అయిన వెంటనే గాలిలో చక్కెర్లు కొడుతూ నియోజకవర్గాన్ని గాలికొదిలేశారని ఆక్షేపించారు. వాటర్ సప్లయి పథకాన్ని తన హయాంలో రూ.35 కోట్లతో పనులు చేపట్టానని, అలాంటిది ఇప్పుడు అనిత ఏదో చేసేసినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. డిగ్రీ కళాశాల ఒక డ్రీమ్ అంటున్న ఆమె సంకల్పం ఉంటే రప్పించాలని సూచించారు. విష, చెడు సంస్కృతులకు మూల బిందువు టీడీపీయేనని విమర్శించారు. 13 మంది మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు నంద్యాలలో తిష్టవేసినా.. గెలుపు మాత్రం వైఎస్సార్ సీపీదేనని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోని శివరామకృష్ణ పాల్గొన్నారు.