సుజనా నోరు అదుపులో పెట్టుకో: జోగి రమేష్
విజయవాడ: ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. ప్రత్యేక హోదా చెల్లని నోటు కాదని, సుజనా చౌదరే చెల్లని కేంద్రమంత్రి అని విరుచుకుపడ్డారు. బ్యాంకులను మోసం చేసి వేలకోట్లు సంపాదించిన ఘనత సుజనా చౌదరిదని జోగి రమేష్ అన్నారు. ఆయన బుధవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో హోదాను సాధించి తీరుతామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా తీసుకురావడం ప్రభుత్వానికి చేతకాలేదు కాబట్టే హోదా కోసం వైఎస్ జగన్ పోరాటం చేస్తున్నారన్నారు.
కేంద్రం, చంద్రబాబు నాయుడు మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని, హోదా వస్తేనే పేదల కడుపులు నిండుతాయన్నారు. టీడీపీ నేతలకు ప్రత్యేక హోదా కాదని, నియోజకవర్గాల పునర్విభజన కావాలనటం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. ప్రజలకు కావల్సింది పునర్విభజన కాదని, ప్రత్యేక హోదానే అని జోగి రమేష్ అన్నారు. ప్రత్యేక ప్యాకేజీలొస్తే జేబులు నిండుతాయనేది టీడీపీ నేతల ఆలోచన అని, ఇప్పటికైనా సుజనా తన నోరును అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు.