రెండో పంట.. రైతుల హక్కు: పార్థసారధి
హైదరాబాద్: త్వరలో వైఎస్ఆర్సీపీ రైతుహక్కు పరిరక్షణ కమిటీ ఏపీ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నట్టు వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారధి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను రెండో పంట వేయొద్దని ఏపీ ప్రభుత్వం చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రెండో పంట వేసుకునే రైతులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని పార్థసారధి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నూతన రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం రాజధాని ప్రాంత రైతుల నుంచి భూములు కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుల తరపున వైఎస్ఆర్సీపీ పోరాడుతుందుని ఆయన చెప్పారు.
అమాయక రైతుల భూములు లాక్కుని ఏపీ రాజధాని నిర్మించాలనుకోవడం దారుణమన్నారు. రాజధానికి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాదని పార్థసారధి స్పష్టం చేశారు. అవసరమైతే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కూడా రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని పార్థసారధి చెప్పారు.