చంద్రబాబుపై ఎందుకు కేసు పెట్టకూడదు?
విజయవాడ: ఏపీలో ఉన్నది మోసకారి ప్రభుత్వమని, టీడీపీది పూర్తి అసమర్ధ నాయకత్వమని ప్రజలు నిర్ధారణకొచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారధి అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు చేపట్టిన నవ నిర్మాణ దీక్ష ఫార్స్ అని, వారి నిస్సహాయతను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే దీక్ష పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు సర్కార్ పిచ్చి పట్టినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. టీడీపీ నేతల ఊకదంపుడు ఉపన్యాసాల కోసం మహిళలను, పిల్లలను మండుటెండలో కూర్చోబెట్టడం దారుణమని పేర్కొన్నారు. పిల్లలను ఎండలో హింసించినందుకుగానూ చంద్రబాబుపై కేసు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు.
2029లో ఇది చేస్తాం, 2050లో అది చేస్తామంటూ ఇంకా ప్రజలను మభ్యపెడుతున్నారని, అయితే చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదని తెలుసుకోవాలని హితవు పలికారు. ఈ మూడేళ్లలో చంద్రబాబు ఏం సాధించిందని నవ నిర్మాణ దీక్ష చేపట్టారని పార్థసారధి సూటిగా ప్రశ్నించారు. ఓ వైపు టీడీపీ నేతలకు ఏసీలు, టెంట్ లు ఉంటే.. మహిళలు, పిల్లలను ఎండలో నిలబెట్టి హింసించారని.. టీడీపీ సమావేశాలైతే అలాగే నిర్వహిస్తారా అని మండిపడ్డారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు గ్యాస్ ధర పెరిగితే.. పెరిగిన సబ్సీడీ భారాన్ని మోసి ప్రజలకు ఊరట కలించారని ఈ సందర్భంగా గుర్తుచేవారు. అయితే తెల్ల రేషన్ కార్డులపై ఇచ్చే 8 సరుకులు ఇవ్వకుండా ఎగనామం పెట్టే యోచనలో చంద్రబాబు సర్కార్ ఉందన్నారు.