కంకిపాడు(పెనమలూరు): జిల్లా ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే జిల్లా అభివృద్ధి చెందుతోందంటూ జిల్లా యంత్రాంగం అంకెలగారడీతో ప్రజలను పక్కదారి పట్టించే యత్నం చేయటం దౌర్భగ్యమని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధిపై అభూత కల్పనలు çకలెక్టరే సృష్టించటం శోచనీయమన్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు కష్టాలు పడుతున్నారన్నారు. అర్థం లేని నిబంధనలతో రైతుని రోడ్డుపైకి లాగే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు.
జిల్లాలో ఎందరు కౌలుదారులున్నారో?, ఎంత సాగు జరుగుతుందో? కౌలురైతులకు ఎంత రుణం ఇచ్చారో జిల్లా అధికారుల వద్ద లెక్కలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. కౌలుదారులకు సక్రమంగా రుణాలు, సబ్సిడీ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులది కాదా? అని ప్రశ్నించారు. ధాన్యం అమ్మిన తరువాత నెల రోజులకూ డబ్బులు అందక ఇబ్బందులు పడ్డారన్నారు. మినుము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కనీసం 10 శాతం కూడా కొనుగోళ్లు చేపట్టలేదని, బహిరంగ మార్కెట్‌లో రూ.3,800 నుంచి రూ.4300లకే క్వింటా మినుములు కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి నిధులు కేటాయించి మద్దతు ధరకు మినుములు ఎలాంటి నిబంధనలు విధించకుండా కొనాలని డిమాండ్ చేశారు. ఉపాధి పనులు చేసిన కూలీలకు డబ్బులు కూడా ఏడాదిగా అందడం లేదని కలెక్టరు గుర్తించాలన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు.
కృష్ణాడెల్టా ఆధునికీకరణకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.5 వేల కోట్లు నిధులు కేటాయిస్తే ఆ పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిందని విమర్శించారు. సీఎం, మంత్రుల భవనాల ఆధునికీకరణలకు రూ.కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. డెల్టా పనులు జాప్యం వల్ల తెలంగాణలో బీమా ప్రాజెక్టు పూర్తయ్యి అక్కడ 20 టీఎంసీల సాగునీరు నిల్వ అవుతుందని, సాగునీటి నష్టాన్ని, సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చూడటంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు.
మంత్రి ఉమా దద్దమ్మ..
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేతగాని తనం వలన జిల్లాలో అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేని ఆయన, పెద్ద మాటలు మాట్లాడితే ప్రజలు నాలుక చీరేందుకు కూడా వెనుకాడరని, సిగ్గుతెచ్చుకుని జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ పామర్రు నియోజకవర్గ సమన్వయకర్త కైలే అనిల్‌కుమార్, మండల అధ్యక్షుడు మద్దాలి రామచంద్రరావు, జిల్లా సహాయ కార్యదర్శి మాదు వసంతరావు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామినేని రమాదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment