మెహిదీపట్నంలోని సోమయాజులు నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో వైవీ సుబ్బారెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు డీఏ సోమయాజులు (64) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న సోమయాజులును రెండురోజుల క్రితం హైదరాబాద్‌లోని ‘సిటీ న్యూరో సెంటర్’లో చేర్చారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున 3.14 గంటలకు ఆసుపత్రిలోనే ఆయన తుది శ్వాస విడిచారు. సోమయాజులుకు తల్లి సుబ్బలక్ష్మి, భార్య కళ్యాణి, కుమారుడు డీఎన్ కృష్ణ ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో (2004–09)ఆర్థిక వ్యవహారాలు, విధానాల అమలుకు సంబంధించిన ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించారు. వ్యవసాయ సాంకేతిక మిషన్ డిప్యూటీ చైర్మన్‌గా కూడా పని చేశారు. ఆర్థిక పరమైన నిర్వహణా వ్యవహారాల్లో అపారమైన అనుభవం గల సోమయాజులుకు రాజకీయ వర్గాల్లో మంచి పేరుంది. వైఎస్సార్ సీపీని స్థాపించిన నాటి నుంచి పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు.
హుటాహుటిన హైదరాబాద్‌కు జగన్
సోమయాజులు మృతి పట్ల పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం తన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని ఉదయం 10 గంటల కల్లా హైదరాబాద్‌కు వచ్చారు. మెహిదీపట్నం రమణమూర్తి కాలనీలోని సోమయాజులు నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించారు. శోకసముద్రంలో ఉన్న కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ, సాక్షి చైర్‌పర్సన్ వైఎస్ భారతీరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో ప్రముఖులు సోమయాజులు భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. సోమయాజులు మరణం తీరని లోటని, తమ కుటుంబంలో ఒక ఆత్మీయుడిని కోల్పోయామని భారతీరెడ్డి చెప్పారు. కాగా సోమయాజులు అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రశాసన్‌నగర్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. పలువురు ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు, బంధువులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సోమయాజులు భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న వైఎస్ భారతీరెడ్డి
ప్రముఖుల నివాళి
సోమయాజులు మరణవార్త తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు శెట్టిపల్లి రఘురామిరెడ్డి, ఆదిమూలపు సురేశ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, పార్టీ నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, నారమిల్లి పద్మజ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎస్.దుర్గా ప్రసాదరాజు, విజయచందర్, పీఎన్వీ ప్రసాద్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కె.శివకుమార్ తదితరులు ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, మాజీ ఎంపీలు కొణతాల రామకృష్ణ, ఉండవల్లి అరుణ్‌కుమార్, లగడపాటి రాజగోపాల్, తెలంగాణ సీఎల్పీ నేత కె.జానారెడ్డి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, డీకే సమరసింహారెడ్డి, డి.శ్రీనివాస్, సి.రామచంద్రయ్య, టీఆర్‌ఎస్ నేత గట్టు రామచంద్రరావు, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, ప్రభుత్వ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ఆర్టీఐ మాజీ కమిషనర్ సుధాకర్‌రావు, ఐపీఎస్ అధికారి రమేష్‌రెడ్డి, బండ్ల గణేష్ (సినీ నిర్మాత), పారిశ్రామికవేత్త రఘురామరాజు తదితరులు కూడా సోమయాజులు భౌతికకాయం వద్ద నివాళులర్పించి ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment