రైతుకు అందించిన ట్రాక్టర్‌ను నడుపుతున్న శ్రీరంగనాథరాజు
పశ్చిమగోదావరి, ఆచంట: రైతులకో శుభవార్త. రూ.లక్ష సబ్సిడీపై పెద్దట్రాక్టర్లు అందించేందుకు వైఎస్సార్ సీపీ ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు శ్రీకారం చుట్టారు. అంతేకాదు. పన్నులు సైతం చెల్లించకుండా మినహాయింపునిచ్చారు. ఈ అవకాశం జిల్లాలోని రైతులందరికీ రాజకీయాలకతీతంగా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ పథకంతో అవస్థలు
ప్రస్తుతం ప్రభుత్వం రైతు రథం పథకం కింద రూ.1.50 లక్షల సబ్సిడీతో రైతులకు పెద్ద ట్రాక్టర్లు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకంలో రైతులు ట్రాక్టరు పొందాలంటే చాలా కష్టపడాల్సి వస్తోంది. కాళ్లరిగిపోయేలా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఒక్కో ట్రాక్టరుకు రూ.50 వేల వరకూ అనధికార మామూళ్లు సమర్పించుకోవాల్సి వస్తోంది. ఇంత చేసినా చివరకూ ట్రాక్టర్ అందుతుందో లేదో భరోసా ఉండడం లేదు. అధికార పార్టీ నేతలకే ట్రాక్టర్లు అందుతున్నాయన్న విమర్శలు తీవ్రంగా వినబడుతున్నాయి.
రైతుల కష్టాలకు చలించి..
ఈనేపథ్యంలో రైతులు పడుతున్న అవస్థలు తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నేత శ్రీరంగనాథరాజు చలించిపోయారు. తాడేపల్లిగూడెంలోని మహీంద్రా ట్రాక్టర్ డీలర్‌తో సంప్రదింపులుజరిపారు. రైతులకు ఇన్వాయిస్‌పై రూ.లక్ష తగ్గింపుతోపాటు, పన్ను కూడా చెల్లించకుండా నేరుగా ట్రాక్టరు చేరేలా ఏర్పాట్లు చేశారు. డీలరు తగ్గించే మొత్తం తానే చెల్లిస్తానని శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు. రైతులకు అండగా నిలవడానికి ముందుకొచ్చారు.
మొదటి ట్రాక్టరు పంపిణీ : ఆచంట మండలం శేషమ్మచెరువులో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఇదే మండలం భీమలాపురం గ్రామానికి చెందిన రైతు కుడిపూడి వెంకటరత్నం(చిన్నా)కు మొట్టమొదటి ట్రాక్టరును శ్రీరంగనాథరాజు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు కుటుంబంలో పుట్టిన తనకు రైతుల సాధకబాధలు తెలుసునని, ట్రాక్టరు కోసం వారు పడుతున్న కష్టాలు తెలుసుకుని వారికి తగ్గింపుతో ట్రాక్టర్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని చెప్పారు. కుల మతాలకు అతీతంగా జిల్లాలోని సన్న,చిన్నకారు రైతులందరికీ ట్రాక్టర్లు అందిస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే నియోజకవర్గంలో లక్షలాది రూపాయలతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న శ్రీరంగనాథరాజు రైతన్నకు అండగా నిలిచి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకోవడం పట్ల రైతుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు సుంకర సీతారామ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు గొడవర్తి వెంకన్నబాబు, పార్టీ రాష్ట్ర నాయకులు ముప్పాల వెంకటేశ్వరరావు, ముత్యాల నాగేశ్వరరావు, కర్రి వెంకటనారాయణ(వాసు), వైట్ల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment