
ఏపీ సీఈఓ గోపాల కృష్ణ ద్వివేది, వైఎస్సార్‌సీపీ నేత సుధీర్ రెడ్డి(పాత చిత్రం)
అమరావతి: వైఎస్సార్ జిల్లాలో అత్యంత ఫ్యాక్షన్ ప్రభావిత నియోజకవర్గం జమ్మలమడుగు. ఒకప్పుడు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇద్దరూ టీడీపీలో సర్దుకుపోయారు. ఇద్దరు నేతలు పాత కక్షలు మర్చిపోయి పర్సంటేజీలు మాట్లాడుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ గెలిస్తే తమ ఆటలు సాగవని భావించి ఎన్నికలు దగ్గర పడే కొద్దీ గ్రామాల్లో మళ్లీ భయోత్పాతం సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నారు. గ్రామాలను తమ అదుపులో పెట్టుకుని పోలింగ్ రోజును రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
వీరిని కాదని కొన్ని గ్రామాల్లో ఏం చేయలేని పరిస్థితి కూడా ఉంది. స్వతంత్ర్యంగా ఓటు వేసే పరిస్థితి కూడా లేదు. కొన్ని గ్రామాల్లో వీరిని కాదని ఏజెంట్లుగా కూర్చునే సాహసం కూడా చేయటం లేదు. పోలీసులను అడ్డం పెట్టుకుని అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు అరాచకానికి పాల్పడుతున్నారు. ప్రచారం నిమిత్తం వచ్చిన వైఎస్సార్‌సీపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్‌రెడ్డిని గ్రామాల్లోకి రానివ్వకుండా పలుమార్లు టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. పక్కన పోలీసులున్నా చూస్తూ మిన్నకుండిపోయారు.
ఎన్నికల వేళ వీరి ఆగడాలు మితిమీరి పోతాయని భావించి సుధీర్‌రెడ్డి తరపు న్యాయవాది రఘురామిరెడ్డి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని కలిసి ఫిర్యాదు చేశారు. జమ్మలమడుగులోని సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్ బూత్‌లో వెళ్లేందుకు ఏజెంట్‌లు భయపడుతున్నారని, ఆ గ్రామాలు టీడీపీ నేతల కంట్రోల్‌లో ఉండటంతో ఏజెంట్లుగా కూర్చునేందుకు స్థానికులు సాహసం చేయటం లేదని తెలిపారు. బయటి గ్రామాల నుంచి ఏజెంట్‌లను తెచ్చిపెట్టుకునేందుకు అనుమతి ఇవ్వమని ఎన్నికల ప్రధానాధికారిని కోరినట్లు రఘురామి రెడ్డి తెలిపారు.