
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదీని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షులు, పార్టీ అధికార ప్రతినిథి ఎంవీఎస్ నాగిరెడ్డి మంగళవారం కలిశారు. ఈసీ తాకీదులకు సమాధానాలు ఇచ్చినా మళ్లీ నోటీసులు జారీచేశారని ఫిర్యాదు చేశారు. ద్వివేదిని కలిసిన అనంతరం ఎంవీఎస్ విలేకరులతో మాట్లాడుతూ.. డెప్యూటేషన్‌పై ఎన్నికల విధుల్లో ప్రభుత్వం నియమించిన టీడీపీ కోవర్టులే ఈసీని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి నేటి వరకు టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు.
బాథ్యతాయుతమైన సీఎం పదవిలో ఉన్న చంద్రబాబు ఎన్నికల ప్రక్రియనే అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కోడ్ ఉల్లంఘనపై ఎప్పటికప్పుడు సాక్ష్యాధారాలతో సహా ఈసీకి అందజేశామని తెలిపారు. ఫిర్యాదులని కూడా చంద్రబాబు లెక్కచేయకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ చంద్రబాబు ఎన్నికల సంఘానికే సవాల్ విసురుతున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీకి ఈసీ ఇచ్చిన ప్రతి నోటీసుకి సమాధానం ఇచ్చామని తెలిపారు.
టీడీపీ ఒక్క నోటీసుకి కూడా స్పందించలేదని వెల్లడించారు. మీడియా విషయంలోనూ సాక్షికి ఎక్కువ నోటీసులు ఇచ్చారని, టీడీపీ అనుకూల మీడియాకు తక్కువ నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు ఈసీని బెదిరించి అనుకూలంగా పనిచేయించుకుంటున్నాడని చెప్పారు. ఎవరెవరికి ఎన్ని నోటీసులు ఇచ్చారు.. ఎవరెవరు సమాధానాలిచ్చారు అన్న విషయం ఈసీ స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.