
ఏలూరు టౌన్ : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ సీఎం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారాడని, దళిత ద్రోహి అని ఆయనను యావత్ జాతి క్షమించదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చింతలపూడి సమన్వయకర్త ఉన్నమట్ల ఎలీజా అన్నారు. ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ దళిత నేతలతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యత కలిగిన పదవిలో ఉంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిదికాదని హితవు పలికారు.
మాలలకు పట్టుగొమ్మగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందని, చంద్రబాబును వైఎస్ జగన్‌తో ఎలా పోల్చుతారని ప్రశ్నించారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని సీఎం బాబు హేళన చేస్తూ మాట్లాడితే ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నారు? మంత్రి ఆదినారాయణ రెడ్డి దళితులను నీచంగా మాట్లాడితే కనీసం ఖండించలేదేమని ప్రశ్నించా రు. ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించలేని స్థితిలో రాష్ట్రం ఉన్నందుకు నైతిక బాధ్యత వహించి చంద్రబాబు రాజీనామా చేయాలని ఎలీజా డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటనపై మీరు చేసిన చాలెంజ్‌ను స్వీకరిస్తున్నామని, నిజనిర్ధారణకు మీరు సిద్ధమా అని ఎలీజా ప్రశ్నించారు.
హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ సొంత ఊరు ఎప్పుడు వెళదామో, సమయం, తేదీ చెప్పాలని, నిజనిర్ధారణ చేద్దామని.. వచ్చే దమ్ముంటే చెప్పాలని ఎలీజా కారెం శివాజీకి సవాల్ విసిరారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పళ్లెం ప్రసాద్ మాట్లాడుతూ కారెం శివాజీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా అని ఎద్దేవా చేశారు. పార్టీ ఎస్సీ సెల్ ఏలూరు పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు మాట్లాడుతూ టీడీపీ ప్రోద్భలంతోనే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందన్నారు. ఎస్సీ సెల్ నగర నాయకులు మున్నుల జాన్‌గురునాథ్, నగర అధ్యక్షుడు జయకర్,బోడా కిరణ్‌కుమార్, ప్రత్తిపాటి తంబి, చింతా దుర్గారెడ్డి, ఎం.కిషోర్, ప్రవీణ్‌బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment