ఖాజీపేట: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు మెదపకపోవడం దారుణమని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు.వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే రాజోలు జలాశయం నిర్మించి కేసీ కాలువ ఆయకట్టు స్థిరీకరించి రైతులకు రెండుకార్లకు సాగునీరు ఇచ్చేలా కృషిచేస్తామన్నారు. ఖాజీపేటకు చెందిన శ్రీ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పీవీ రాఘవరెడ్డి, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సుంకేశుల ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ఖాజీపేట వరకు భారీ ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఖాజీపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎంపీ ప్రారంభించారు. అనంతరం ఖాజీపేట బస్టాండ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కేసీ కాలువకు సాగునీటి కోసం మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో తామంతా కలిసి మైదుకూరు కూడలిలో ప్రతి ఏటా ధర్నాలు, జాతీయ రహదారులపై రాస్తారోకోలు చేపడితే గానీ కేసీ కాలువకు నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు.
నేడు శ్రీశైలంలో సాగునీరు పూర్తిగా తగ్గిపోతోందన్నారు. ఈ ప్రాజెక్టును నమ్ముకుంటే రైతులకు కష్టమన్నారు. అందుకే రాజోలు నిర్మిస్తే అక్కడ 3 టీఎంసీలు నీరు నిల్వ ఉంచి రెండు కార్లకు రైతులకు నీరు అందించేందుకు, కాలువ పరిధిలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాజోలు కోసం దువ్వూరు నుంచి కడప వరకు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశామన్నారు. మరుసటి రోజు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రాజెక్టుపై నోరు మెదపక పోవడం దారుణమన్నారు. తెలుగుగంగ కాలువకు, వెలుగోడు నుంచి 0నుంచి 18 నంబరు వరకు కాలువ బలహీనంగా ఉందన్నారు. దీని వల్ల జిల్లాకు నీరు తక్కువ వస్తోందని కాలువను ఆధునికీకరించమని నాలుగేళ్లుగా మంత్రిని కలిసి విన్నవించినా పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ జనార్ధన్‌రెడ్డి, ఖాజీపేట మాజీ ఉపసర్పంచ్ గంగాధర్‌రెడ్డి, బి.మఠం నాయకుడు వీరనారాయణరెడ్డి, తోపాటు మైదుకూరు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నవరత్నాలతో నే అందరికీ మేలు
ప్రజా సంక్షేమం కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలు అనే గొప్ప పథకాలను ప్రవేశపెట్టారని వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి అన్నారు. ఆ పథకాలు అమలైతే ప్రతి పేద, బడుగు బలహీన వర్గాల వారందరికీ మేలు జరుగుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి వేలు చేయాలని పరితపించిన వ్యక్తి మన వైఎస్సార్ అన్నారు. నేడు వైఎస్ జగన్ కూడా ప్రతి ఒక్కరికి వేలు చేయాలన్న పట్టుదలతో ఉన్నారన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంతోపాటు మన జిల్లా కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.
మైనార్టీలకు మేలు చేసిన ఏకైక వ్యక్తి వైఎస్సార్
దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించి ప్రతి ముస్లింకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మేలు చేశారని, అందుకు ప్రతి ముస్లిం వైఎస్సార్‌కు రుణపడి ఉంటారని కడప ఎమ్మెల్యే అంజద్ బాషా అన్నారు. ఖాజీపేటలో షాదీఖానా అసంపూర్తిగా ఉందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
తెలుగు గంగ ప్రాజెక్టులో 12 టీఎంసీల నీరు నిల్వ చేస్తాం
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాజోలు నిర్మించి కేసీ కాలువ ఆయకట్టును స్థిరీకరిస్తామని, తెలుగు గంగకు 12 టీఎంసీల నీరు నిల్వ చేస్తామని, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. ఖాజీపేట లోని అగ్రహారం సొసైటీలో 12వందల మంది పేరుతో రూ. 2.50కోట్లు దోచుకున్నారని చెప్పారు. దీనిపై విచారణ జరుగుతుంటే టీడీపీ నాయకుడు పుట్టా సుధాకర్‌యాదవ్ అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. పుట్టా.. అందులో నీ వాటా ఎంత అని ప్రశ్నించారు. మైదుకూరు మున్సిపాలిటీకి రూ. 5కోట్లు ఇస్తానన్న ముఖ్యమంత్రి మాట తప్పారన్నారు. 2014–15 ఏడాది కాలంలో చేసిన పనులు నేడు చేసినట్లు టీడీపీ నాయకులు రూ.3కోట్లు దొంగ బిల్లులు పెట్టుకుని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
టీడీపీ నాయకులు వస్తే నిలదీయండి
టీడీపీ నాలుగున్నరేళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేశారో గ్రామాలకు వచ్చే టీడీపీ నాయకులను చొక్కా పట్టుకుని నిలదీయాలని వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు కోరారు. చంద్రబాబు ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి అందరిని మోసం చేశారన్నారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకుని జగన్‌పై నిందలు వేయడం టీడీపీ నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ అని గుర్తు చేశారు.
నిధులు ఇవ్వకుండా పాలన అన్యాయం
టీడీపీ పాలనలో జెడ్పీటీసీలకు, ఎంపీటీలకు ఎమ్మెల్యేలకు నిధులు విడుదల చేయకుండా టీడీపీ నాయకులకు నిధులు విడుదల చేసి పాలన చేయడం చంద్రబాబుకు సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ బద్వేలు నియోజకవర్గ ఇన్‌చార్జి వెంకటసుబ్బయ్య విమర్శించారు. జన్మభూమి కమిటీల పేరుతో అర్హులకు అన్యాయం చేస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment