సాక్షి ప్రతినిధి, కాకినాడ : తాజాగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని అల్లవరం, అమలాపురం, ఉప్పలగుప్తం మండలాల్లోని 263 పోలింగ్ బూత్‌ల పరిధిలోని ఐదు వేల ఓట్లు తొలగించేందుకు కొందరు అజ్ఞాత వ్యక్తులు ఆన్‌లైన్‌లో ఆది, సోమవారాల్లో దరఖాస్తు చేశారు. విచిత్రమేమిటంటే వైఎస్సార్‌సీపీ బూత్ కన్వీనర్ల పేరిట ఆన్‌లైన్ దరఖాస్తు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి ఒట్ల తొలగింపు చేపట్టాలని ఆన్‌లైన్‌లోనే జాబితాలు పంపించారు.
సదరు వైఎస్సార్‌సీపీ బూత్ కమిటీ కన్వీనర్లకు ఈ విషయమే తెలియదు. వారెటువంటి దరఖాస్తు చేయకుండానే ఈ కుట్రకు తెరదీశారు. మొన్నటికి మొన్న కాకినాడలోని దుమ్ములపేట, రేచర్లపేట, ఏటిమొగ, పర్లోవపేట, కొత్త కాకినాడ, ముత్తానగర్, చర్చి స్క్వేర్ సెంటర్ ప్రాంతాల నుంచి ఒకే రోజున 1500 నుంచి 2వేల వరకు కొత్త ఓట్లు అప్‌లోడ్ చేశారు. ఒకే ప్రాంతం నుంచి 150 నుంచి 200 వరకు బల్క్ లో ఎంట్రీలు చేశారు. మీ సేవ చిరునామాలతో ఓటర్ల నమోదు చేయడంతో అధికారులకు అనుమానం వచ్చి పరిశీలించే సరికి ఇక్కడేదో జరుగుతుందని నిర్ణయానికొచ్చారు. మీసేవ, ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులను పిలిచి అధికారులు గట్టిగా మందలించారు.ఈ ఘటన మరువక ముందే బుధవారం అమలాపురంలో బట్టబయలు.
∙ఆ మధ్య టీడీపీ కిరాయి మనుషులు జిల్లాలో విస్తృతంగా పర్యటించి తమకు వ్యతిరేకంగా ఉన్న ఓటర్ల వివరాలను తెలుసుకుని, వాటిని తొలగించేందుకు పావులు కదిపారు. పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల పరిధిలోని మాచవరం, వాకలగరువు గ్రామాల్లో రెండు బృందాలుగా 11 మంది యువకులు ‘స్పా’ అనే సంస్థ పేరుతో తిరుగుతూ వైఎస్సార్‌సీపీ నేతలకు పట్టుబడ్డారు. టీడీపీ గుర్తింపు కార్డులు, మంత్రి నారా లోకేష్ ఫొటో ఉన్న ఐడెంటిటి కార్డులతో సంచరిస్తూ అడ్డంగా దొరికిపోయారు. వీరిని పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. ఆ ముఠా బస చేసిన తాటిపాక లోని లాడ్జి వద్దకు వెళ్లేసరికి మరికొన్ని విషయాలు వెలుగు చూశాయి.
కానీ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో వారిని తర్వాత వదిలేశారు.ఇదంతా చూస్తుంటే ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్లు చేర్పించే విషయంలో ఏ స్థాయిలో కుట్ర జరుగుతోందో అర్థమవుతుంది. జిల్లాలో వైఎస్సార్ సీపీ అనుకూల ఓట్లు తొలగించేందుకు, అధికార పార్టీ నాయకులకు తమకు అనుకూలంగా బోగస్ ఓట్లు చేర్పించేందుకు పథకం ప్రకారం వెళ్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఓటర్లు అప్రమత్తం కాకపోతే రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ప్రజాస్వామ్యవాదులు హెచ్చరిస్తున్నారు.
ఓటమి భయంతోనే...
టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఓట్ల కుట్రతో గెలవాలని చూస్తోంది. అందుకు కిరాయి మనుషులను రంగంలోకి దించింది. వీరు గ్రామాల్లో సంచరించి వైఎస్సార్‌సీపీ అనుకూల ఓటర్ల వివరాలను సేకరించారు. టీడీపీకి వ్యతిరేక ఓట్లను తొలగించేందుకు వ్యూహాత్మకంగా గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టాయి. ఆ జాబితాకు అనుగుణంగా ఓట్లను తొలగించే పనిలో పడ్డాయి. దానికి ఉదాహరణ అమలాపురం నియోజకవర్గంలో తాజాగా వెలుగు చూసిన వ్యవహారాన్నే తీసుకోవచ్చు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సుమారు ఐదు వేల ఓట్లు తొలగించేందుకు కుట్ర చేశారు.
ఓటరు జాబితా నుంచి గ్రామంతరం, డెత్ ఓట్లు తొలగించేందుకు ఉపయోగించే ఫారమ్–7 ద్వారా ఓట్లు తొలగించేందుకు కిరాయి బృందాలు వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. నియోజకవర్గ పరిధిలోని 263 పోలింగ్ బూత్‌ల్లోని ఓట్లు తొలగించేందుకు వైఎస్సార్‌సీపీ బూత్ కమిటీ కన్వీనర్లు పేరుతో అజ్ఞాత వ్యక్తులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయించారు. ఈక్రమంలో సోమ, మంగళవారాల్లో తహసీల్దార్ కార్యాలయాలకు ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి 15 నుంచి 40 ఓట్లు తొలగించాలని ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చాయి. ఫారమ్–7 ద్వారా వైఎస్సార్‌సీపీ బూత్ కన్వీనర్ల పేరిట అజ్ఞాత వ్యక్తులు మోసానికి పాల్పడ్డారు. అల్ల వరం మండలంలో 1300 ఓట్లు, ఉప్పలగుప్తం మండలంలో 996 ఓట్లు, అమలాపురం మండలంలో 2,800 ఓట్లు తొలగించాలని ఆన్‌లైన్ దరఖాస్తులు అందాయి.
ఇదే విషయమై ఎవరి పేరునైతే ఆన్‌లైన్‌లో తొలగింపు దరఖాస్తులు ఇచ్చారో వారిని అడిగితే తమకు తెలియదని, తమ పేరును ఎవరో ఇలా చేశారని, బూత్ కమిటీ కన్వీనర్లుగా ఉన్న తమ పేర్లను అజ్ఞాత వ్యక్తులు వాడుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ అప్రమత్తమై ఆర్డీవోతో మాట్లాడారు. అజ్ఞాత వ్యక్తుల నుంచి ఆర్‌లైన్‌ల్లో వచ్చిన దరఖాస్తులపై విచారణ జరపాలని, తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీని వెనుకున్న కుట్రను వెలికి తీయాలని డిమాండ్ చేశారు.
ఓట్ల తొలగింపును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ధర్నా
ఏలేశ్వరం (ప్రత్తిపాడు) : వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపును నిరసిస్తూ స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఆ పార్టీ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి అలమండ చలమయ్య, పట్టణ అధ్యక్షుడు శిగడం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం నగర పంచాయితీ కమిషనర్‌కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి బూత్‌లోని 20–50 ఓట్లు తొలగించాలని తమ పార్టీ బూత్ కన్వీనర్లు అర్జీలు పెట్టుకున్నట్లు బీఎల్‌ఓల ద్వారా తమకు తెలిసిందన్నారు.అలా తమ పార్టీ నుంచి ఎవరూ అర్జీలు పెట్టలేదన్నారు. అధికార పార్టీకి చెందినవారే తమ పేర్లతో 2 వేల ఓట్లు తొలగించేందుకు కుట్రపూరితంగా అర్జీలు పెట్టినట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు దర్యప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామంతుల సూర్యకుమార్, తొండారపు రాంబాబు,మూది నారాయణస్వామి ,బదిరెడ్డి గోవిందు, దాకమర్రి సూరిబాబు, కర్రోతు గాంధీ, వసంత యోహాన్, వాగు బలరాం తదిరులు పాల్గొన్నారు.
ఓట్ల తొలగింపు, పెద్ద సంఖ్యలో నమోదుకు పాల్పడితే జైలే: కలెక్టర్ కార్తికేయ మిశ్రా
కాకినాడ సిటీ: రాష్ట్రంలో ఆన్‌లైన్‌విధానం ద్వారా ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపునకు, ఓటర్ల నమోదుకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నట్లు ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చిందని, ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కార్తికేయమిశ్రా బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. కొంతమంది ఓటర్లకు తెలియకుండా ఫారమ్–7లో ఓటర్ల తొలగింపునకు,అదే విధంగా ఫారం–6లో ఓటర్ల నమోదుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చిందన్నారు.
ఇటువంటి చర్యలు చట్ట వ్యతిరేకమని, ఇటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోలీసులకు ఆదేశాలిచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై ఫిర్యాదులు వస్తే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లకు తెలియకుండా తొలగింపులకు, నమోదులకు పాల్పడే వారి సమాచారాన్ని తెలియజేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఓటర్ల జాబితాలో ఓటర్ల తొలగింపునకు సంబంధిత అధికారులు దరఖాస్తులను పరిశీలించి వాటిపై దర్యాప్తు చేసి అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా తొలగింపు కుదరదని, ఈ మేరకు ఎన్నికల అధికారులు అప్రమత్తంగా ఉన్నారని మిశ్రా వివరించారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
పార్టీ మండల అధ్యక్షుడు కొనుకు బాపూజీ ఆధ్వర్యంలో బుధవారం వైఎస్సార్‌సీపీ బూత్ కన్వీనర్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ చర్యలకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి యిళ్ల శేషారావు, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి మెరికల శ్రీను, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి గుత్తుల రాజు, బీసీ సెల్ అధ్యక్షుడు యల్లమిల్లి బోసు, రైతు విభాగ అధ్యక్షుడు బొక్కా శ్రీను, ఈతకోట సతీష్, గ్రామకమిటీ అధ్యక్షుడు పెచ్చెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఓట్ల తొలగింపునకు ఎలాంటి అభ్యర్థనలు చేయలేదు
నేను అమలాపురం పట్టణంలో 49వ బూత్ కమిటీకి వైఎస్సార్ సీపీ కన్వీనర్‌గా ఉన్నాను. కన్వీనర్‌గా నా ప్రమేయం లేకుండా... నా సంతకం లేకుండా నా బూత్ పరిధిలో కొన్ని ఓట్ల తొలగింపులు జరుగుతున్నాయి. ఇదంతా తెర వెనుక ప్రభుత్వం చేస్తున్న కుట్రగా కనిపిస్తోంది. ఇలా ప్రతి బూత్ నుంచి వైఎస్సార్ సీపీకి చెందిన సగటున 50 ఓట్లు తొలగిస్తే నియోజకవర్గం మొత్తం మీద పది వేల ఓట్లకు గండి పడుతుందన్నది వాస్తవం. తమ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చంద్రబాబు ప్రభుత్వం చేస్తుందన్న అనుమానం కలుగుతోంది. –మట్టపర్తి నాగేంద్ర, 49వ బూత్ వైఎస్సార్ సీపీ కన్వీనర్, అమలాపురం
ఇది ముమ్మాటికీ ప్రభుత్వం పనే...
వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్లే ఆన్‌లైన్‌లో ఓట్ల తొలగింపునకు అభ్యర్ధించినట్లుగా సృష్టించి ఎవరికీ అనుమానం రాకుండా ప్రభుత్వమే ఈ పనిచేసింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ కుట్రే. సకాలంతో మేము గుర్తించాం కాబట్టి కుట్ర బయటపడింది. తమ పార్టీని ఎదుర్కొనే సత్తా లేక ఇలా దొడ్డిదారిలో తమ పార్టీకి చెందిన ఓట్లు తొలగించే పని చేయడం సిగ్గుచేటు. అమలాపురం పట్టణంలోని 46వ బూత్ కమిటీ పార్టీ కన్వీనర్‌గా ఉన్న నాకు తెలియకుండానే నేనే ఓట్ల తొలగింపునకు అభ్యర్ధించినట్లు ఆన్‌లైన్‌లో కోరడం పచ్చి అబద్దం. దీనిపై చివరి దాకా పోరాడుతాం. – సంసాని నాని, అమలాపురం నియోజకవర్గ బూత్ కమిటీల
వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి, అమలాపురంకుట్ర పూరితంగా ఇరికిస్తున్నారు
ఫారమ్–7 ద్వారా బూత్ పరిధిలో ఓట్లు తొలగించాలని నా పేరున ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. బూత్ పరిధిలో ఓట్లు తొలగించాల్సిన అవసరం మాకేంటి...? బూత్ లెవల్ అధికారులు వచ్చి ఫారమ్–7లో ఇచ్చిన ఓటర్ల జాబితా వివరాలను విచారణ చేసి మా వద్ద నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. – దాసరి అప్పలస్వామి, మాజీ సర్పంచి, తాడికోన, అల్లవరం మండలం
వైఎస్సార్‌సీపీ బూత్ కన్వీనర్లను టార్గెట్ చేశారు
వైఎస్సార్‌సీపీ బూత్ కన్వీనర్లను టార్గెట్ చేసుకుని వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించాలని అధికార పార్టీ ఈ పనికి పాల్పడింది. దేవగుప్తంలోని 174 పీఎస్‌లో 16 ఓట్లు, 175 పీఎస్‌లో 56 తొలగించాలని ఆన్‌లైన్‌లో మా పేరున, ముత్తాబత్తుల ఏడుకొండలు పేరున దరఖాస్తు చేశారు. అధికార పార్టీ ఈ ఆగడాలకు పాల్పడుతోంది. దీనిపై బూత్ లెవల్ అధికారులు విచారణ చేపట్టారు. – పోతుల చినబాబు, వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్, దేవగుప్తం, అల్లవరం మండలం
Comments
Please login to add a commentAdd a comment