
'అనంత' సస్యశ్యామలం హామీ ఏమైంది బాబూ?
అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మహాధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఉరవకొండలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు.
హంద్రీనీవా ఆయకట్టుకు నీటి విడుదల, స్థానిక సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ నేతృత్వంలో సోమవారం ఉరవకొండలో మహాధర్నా చేపట్టినట్లు ఎమ్మెల్యే చెప్పారు. జీవో నంబర్ 22 సవరణ, 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ మహాధర్నాను విజయవంతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు.
అనంతను సస్యశ్యామలం చేస్తానని చెప్పిన చంద్రబాబు ఎన్నికల హామీ ఏమైందని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ప్రశ్నించారు. గత మూడేళ్లుగా ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో అనంతలోని 64 మండలాలు ఉన్నాయన్నారు. దీని బట్టి జిల్లాలో కరువు ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. 2012లో చంద్రబాబు అనంతపురం జిల్లా పాదయాత్ర సందర్భంగా రైతులకు పంట రుణాలు, బంగారు రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన హామీని కూడా విస్మరించారన్నారు. వైఎస్ జగన్ మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆదివారం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉరవకొండలో మహాధర్నా ఏర్పాట్లను ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, పార్టీ నేతలు తలశిల రఘురాం, నాగిరెడ్డి పరిశీలించారు.