సాక్షి, తాడేపల్లిగూడెం: విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన బాధాకరమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై ఆయన మండిపడ్డారు. నీచ రాజకీయాలు, పిచ్చి మాటలు చంద్రబాబుకు దినచర్యగా మారాయని నిప్పులు చెరిగారు. విశాఖలో ఘటన జరిగిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసి యుద్ధప్రాతిపదికన బాధితులను ఆసుపత్రికి తరలించి వైద్యసాయం అందజేశారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శించి వారికి ఆత్మస్థైరాన్ని నింపారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ప్రకటించిన మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని తెలిపారు. వెంటిలేటర్‌పై ఉన్నవారికి రూ.10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి లక్ష, బాధిత గ్రామాల్లోని 15వేల మందికి ఒకొక్కరికి రూ.10వేలు చెల్లించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
(‘అది టీడీపీ దద్దమ్మల డ్రామా కమిటీ’)
దేశంలోనే కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించిన తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనని ఆయన తెలిపారు. కోటి రూపాయలు ఎలా సరిపోతాయని వ్యాఖ్యానించడం చంద్రబాబు మతిలేనితనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఐఏఎస్ అధికారులతో ఎల్జీ పాలిమర్స్ ఉదంతం పై పూర్తి నివేదిక ఇవ్వాలని కమిటీ వేస్తే స్టైరీన్ గ్యాస్ గురించి తనకే తెలియదని ఐఏఎస్ అధికారులకు ఏం తెలుసునని చంద్రబాబు అనడం చాలా హాస్యాస్పదమన్నారు. ఇదే పాలిమర్ సంస్థ విస్తరణకు 2018లో అనుమతి ఇచ్చిన సంగతి మరచిపోయావా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. త్రిసభ్య కమిటీ అంటూ అచ్చెన్నాయుడు, చిన రాజప్ప, రామానాయుడులను నివేదిక ఇవ్వమనడం చంద్రబాబు అనుభవం ఏమిటో అర్థమవుతుందని కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు.
(‘ప్రచార్భాటంతో ఆయనలా చేసి ఉంటే..’)
Comments
Please login to add a commentAdd a comment