నకిలీ విత్తనాలపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ
అసెంబ్లీ సమావేశాల రెండో రోజున నకిలీ విత్తనాల విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వ్యవసాయ శాఖ మంత్రిని గట్టిగా నిలదీశారు. ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా అడిగిన తొలిప్రశ్నకు మంత్రి ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసి, మరిన్ని అనుబంధ ప్రశ్నలు వేశారు. రవికుమార్ ఏమన్నారంటే..
''నకిలీ విత్తనాల గురించి మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు తయారుచేసి 400-500 రూపాయల వంతున అమాయకులైన రైతులకు అంటగడుతున్నారు. పర్యవేక్షణ బాగా చేస్తున్నామన్నారు. కానీ, ఇది సరిగా లేకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం వాస్తవం కాదా? విత్తనాలు సరఫరా చేసేటప్పుడు పర్యవేక్షణ ఏమాత్రం లేని మాట సంగతేంటి? భారీస్థాయిలో నకిలీ విత్తనాలు సరఫరా అయ్యే అవకాశం ఉందా.. లేదా?
కోల్డ్ స్టోరేజిలో నిల్వ ఉంచిన విత్తనాలను అధికారులు రైతులకు సరఫరా చేస్తున్నారు. వాస్తవానికి మంచి రైతుల వద్దకు వెళ్లి వారి నుంచి విత్తనాలు సేకరించి సరఫరా చేయాలి. కానీ నెలల తరబడి నిల్వ ఉంచిన విత్తనాలను సరఫరా చేయడం వల్ల దిగుబడులు ఘోరంగా దెబ్బతింటున్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ తరహా సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. విత్తనాల సరఫరా విషయంలో ముందు జాగ్రత్తగా తీసుకున్న చర్యలేంటి? అలాగే ఎన్ని వేల టన్నుల విత్తనాలను జిల్లాలకు సరఫరా చేశారు, నాణ్యత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈ సంవత్సరం వ్యవసాయ పరంగా రాష్ట్ర రైతాంగానికి ఏ భరోసా ఇవ్వబోతున్నారు'' అని శరపరంపరగా ప్రశ్నలు సంధించారు.