చాపాడు: రాష్ట్రంలో 2019 ఎన్నికల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతవుతుందని ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి అన్నారు. వెంగన్నగారిపల్లెలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి చంద్రబాబు అధికారంలో వచ్చారన్నారు. ఎంపీ సీఎం రమేష్ చరిత్ర ప్రతి ఒక్కరికీ తెలుసని, దొంగసారాయి వ్యాపారంలో తన తండ్రితో పాటు కేసుల్లో ఇరుక్కుంటే మైసూరారెడ్డి వద్ద కాళ్లబేరానికి వచ్చారన్నారు.
ఈయన చంద్రబాబు పంచన చేరి ఆయన బినామీగా వేల కోట్లు సంపాదించారన్నారు. సొంత జిల్లా అనే రమేష్ ఏనాడైనా సాగునీటి గురించి పట్టించుకున్నాడా, పరిశ్రమల గురించి పోరాటాలు చేశాడా.. నాలుగున్నరేళ్లు బీజేపీ పంచన ఉండి, ఏనాడు పార్లమెంట్‌లో మాట్లాడకుండా ఉక్కు పరిశ్రమ అంటూ 10 రోజులు దొంగదీక్ష చేశాడన్నారు. ఈ నెల 20న ప్రొద్దుటూరులో చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష అని సభ పెడుతున్నారని, ఈయన చేసేవి ధర్మ పోరాట దీక్షలు కాదని, అధర్మ పోరాట దీక్షలన్నారు. శ్రీశైలంలో ప్రస్తుతం నీటి మట్టం 857 అడుగులకు తగ్గిందని, మూడు అడుగులు తగ్గితే కేసీ కాలువలకు సాగునీరు అందదన్నారు.
తాను ప్రతి ఏటా సాగునీటి కోసం అధికారులు, ప్రభుత్వంపై వత్తిడి చేస్తున్నానని, టీడీపీ నాయకులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రాజశేఖరరెడ్డి, జెడ్పీటీసీ బాలనరసింహారెడ్డి, ఎంపీపీ భర్త లక్షుమయ్య, ఉప ఎంపీపీ నరసింహారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మదీనా దస్తగిరి, మండల నాయకులు అన్నవరం రామమోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర్‌రెడ్డి, జాయింట్ సెక్రెటరి ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment