రౌడీల్లా ప్రవర్తించారు
► బాబూ..మీ ఎమ్మెల్యేలకు పద్ధతులు నేర్పించు
► వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి ధ్వజం
► ఎమ్మెల్యే రోజా విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ
► జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు
అనంతపురం : అసెంబ్లీలో అధికార పార్టీ శాసనసభ్యులు రౌడీల్లా ప్రవర్తించారని వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బి.ఎర్రిస్వామిరెడ్డి ధ్వజమెత్తారు. హైకోర్టు అనుకూలంగా తీర్పునిచ్చినా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి అనుమతించనందుకు నిరసనగా శనివారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి, ఫ్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే రోజా విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అధికార పార్టీ అభాసుపాలు చేస్తోందన్నారు. చట్టంపై వారికున్న నమ్మకమేంటో దీన్నిబట్టే అర్థమవుతోందన్నారు.
అసెంబ్లీ సాక్షిగా గవర్నర్‌తో చాలా అవాస్తవాలు చెప్పించారని, ఈ విషయాలను తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు తెలియజేయడానికి బాధ్యతగా మాట్లాడారని గుర్తు చేశారు. అయితే.. ఈ సమయంలో టీడీపీ సభ్యులు గూండాల్లా వ్యవహరించారని ధ్వజమెత్తారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సంస్కృతి నేర్పించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు. పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయులు మాట్లాడుతూ హైకోర్టు తీర్పును అమలు చేయకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, నగర అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ రోజా విషయంలో ప్రభుత్వ తీరును మహిళా లోకం తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్నందునే ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేశారన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి డాక్టర్ మైనుద్దీన్, కార్పొరేటర్లు జానకి, గిరిజమ్మ, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మిద్దె భాస్కర్‌రెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు శంకర్, సేవాదళ్ నగర అధ్యక్షుడు శ్రీనివాసులు, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు బలరాం, నాయకులు జేఎం బాషా, షరీఫ్, పురుషోత్తం, కార్పొరేటర్లు బాలాంజనేయులు, పోతులయ్య, షుకూర్, పార్టీ జిల్లా అధికారప్రతినిధి చింతకుంట మధు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, బాలనాగిరెడ్డి, క్రిష్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జయపాల్ పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా నిరసనలు
రోజా విషయంలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
►మడకశిరలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఆయనతో పాటు 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.
► గుంతకల్లు పట్టణంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు.
► కళ్యాణదుర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని అంబేడ్కర్ విగ్రహం వద్ద గంటపాటు రాస్తారోకో చేశారు.
► పెనుకొండ పట్టణంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
► కదిరి పట్టణంలో నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన ప్రకటించారు.
► రాయదుర్గం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.
► తాడిపత్రి పట్టణంలో నల్లబ్యాడ్జీలతో ధర్నా చేశారు.
► హిందూపురంలో సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు.
► పుట్టపర్తి నియోజకర్గంలోని బుక్కపట్నం, కొత్తచెరువు, నల్లమాడలో నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.