జాతీయ మహిళా సాధికారత సదస్సు అని ఆహ్వానం పంపి విమానాశ్రయంలో తనను ఓ టెర్రరిస్టులా అరెస్టు చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. శనివారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు. విమానాశ్రయంలో ఆపి బాంబులు, తుపాకులు, కత్తులు ఉన్న వారిలా అదుపులోకి తీసుకోవడం దారుణమని అన్నారు. మహిళలపై చంద్రబాబు ప్రభుత్వ చిన్నచూపును వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. టీడీపీ ప్రభుత్వం తనను చంపెయ్యదని గ్యారెంటీ ఏంటి? అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రెస్ మీట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు రోజా మాటల్లోనే..
* ఒక శాసనసభ సభ్యు రాలికి ఏపీలో రక్షణ లేదు.
* రాష్ట్ర డీజీపీ మాటలు సిగ్గుచేటు.
* సదస్సు ఎందుకు పెట్టారయ్యా? బ్రహ్మణి, వెంకయ్య కూతర్ల పబ్లిసిటీ కోసమా?. ప్రజలు పన్ను కట్టిన డబ్బును వినియోగించి మహిళాసాధికారత ఎలా సాధించాలి అనే అంశంపై చర్చిస్తారనుకుంటే మీటింగ్ కు రానీకుండా అరెస్టు చేయించారు.
* సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెలకు నేనంటే ఎందుకంత భయం.
* ప్రతిపక్షం ఎప్పుడూ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపిస్తూ ఉంటుంది. అసెంబ్లీలో మీ జీవితం మొత్తం నన్ను సస్పెండ్ చేయడానికే సరిపోయింది. కాల్ మనీ సెక్స్ రాకెట్‌పై రెండు రోజులు మాట్లాడితే ఏడాది పాటు సస్పెండ్ చేశారు.
* కోడెల శివప్రసాదరావు కోడలిని అడగండి రాష్ట్రంలో మహిళల పరిస్ధితి ఎలా ఉందో చెప్తుంది. ఇంట్లో ఆవిడ ఆర్తనాదాలను నేను వాట్సాప్‌లో పెట్టాను. మహిళలపై కోడెల చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు.
* సదస్సుకు హాజరు కావాలని నాకు రెండు ఆహ్వానాలు పంపారు. మహిళల సమస్యల మీద చిత్త శుద్ధి ఉంది కాబట్టే విజయవాడ వచ్చా. మిమ్మల్ని పొగిడించుకోవడానికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలను పిలిపించారు. రాష్ట్ర సమస్యలు తెలిసిన ఓ వనజాక్షి, లావణ తల్లిని, గౌతమి చెల్లిని, జానీమూన్ ని పిలిస్తే అందరి ముందు మీ రంగు బయటపడేది.
* వెంకయ్యనాయుడు కూతురు, బ్రహ్మణీలు మాట్లాడినవే టెలికాస్ట్ చేశారు. కోడెల శివప్రసాదరావు కోడలు మహిళే కదా. ఆమె మాటలు ఎందుకు టెలికాస్ట్ చేయలేదు.
* వయసులో పెద్దవాడు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో మాట్లాడిన దారుణమైన మాటల కన్నా నేను తప్పు మాట్లాడానా. సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నారు. కర్నూలులో జరిగిన రేప్ గురించి విజయవాడ వస్తే ఫిర్యాదు తీసుకునే వారు లేరు. మీరేం న్యాయం చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసింది సాధారణ మహిళా సాధికారత కాదు కార్పొరేట్ మహిళా సాధికారత. అమరావతిలో అసెంబ్లీ జరిగితే ప్రతిపక్షానికి ప్రాణహాని ఉంది.
* దయచేసి సదస్సుకు వచ్చిన మహిళలు ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉండాలని చెప్పొద్దు.
* కులం పేరుతో రాజకీయాలు చేయొద్దు. బట్టలూడి పోయేలా కొట్టినా మాట్లాడతాం. ఆక్వాఫుడ్ ప్రాజెక్టు దగ్గరు ఓ మహిళను 43 రోజుల పాటు జైల్లో పెడితే ఆ ఘటనను దగ్గరగా చూసిన బృందాకారత్ సదరు మహిళ కన్నీళ్లు తుడిచారు. రాష్ట్ర సమస్యలను తెలిసిన బృందాకారత్, మేథాపాట్కర్ లాంటి వాళ్లను పిలిస్తే వాళ్లు సదస్సులో మాట్లాడేవాళ్లు కదా.