
సాక్షి, అమరావతి: చెంచు జాతిని కాపాడాలని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కోరారు. మంగళవారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన చెంచుల స్థితిగతులపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. శ్రీశైలం అడవుల్లో చెంచులు ఎక్కువగా నివసిస్తున్నారని తెలిపారు. వారికి అటవీ హక్కులు కల్పించి జీవనోపాధిని పెంచాలని కోరారు. జనాభా ప్రతిపాదికన చూస్తే.. చెంచు జాతి రోజు రోజుకు అంతరించిపోతోందన్నారు. వారి జీవన స్థితిగతులు మారాలంటే విద్య ఎంతో అవసరమన్నారు. అటవీప్రాంతంలో రోడ్లు, బోరు వేయాలన్నా అనుమతులు అవసరమవుతున్నాయన్నారు. ఏ పని చేయాలన్నా అటవీ అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
చెంచుల సమస్యలు పరిష్కరిస్తాం..
చెంచుల సమస్యలను పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. అటవీ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఐదు అటవీ ఫలాలకు కేంద్రం మద్దతు ధర ప్రకటించిందని, మరిన్ని అటవీ ఫలాలకు మద్దతు ధర కల్పించాలని కోరామన్నారు. గిరిజనాభివృద్ధికి చెందిన భూములు ఆక్రమణకు గురికాలేదని పేర్కొన్నారు. గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఆస్తుల వివరాలను పుష్పశ్రీవాణి వెల్లడించారు.