
సాక్షి, తాడేపల్లి : దేశచరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు గుర్తుచేశారు. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి నేటితో రెండేళ్లు పూర్తైన సందర్భంగా.. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సుధాకర్‌బాబు మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఒక చరిత్ర అని అన్నారు.
పాదయాత్రలో ఇచ్చిన హమీలను సీఎం వైఎస్ జగన్ ఐదు నెల్లలోనే అమలు చేసి చూపించారని తెలిపారు. ప్రజల కష్టాలు తీర్చడం కోసమే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారని.. ఆయన చేసిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.
పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ
అంతకు ముందు మీడియాతో మాట్లాడిన సుధాకర్‌బాబు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలోనే ఇసుకను విచ్చలవిడిగా దోచేశారని ఆరోపించారు. అప్పుడు స్పందించని పవన్ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. ప్రజలు తిరస్కరించినా పవన్ సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చిరంజీవి లేకపోతే పవన్ సినిమాల్లో వచ్చేవారా అని ప్రశ్నించారు. పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అని విమర్శించారు. ఇసుక దోపిడీని ఆరికట్టేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నూతన విధానం తీసుకొచ్చారని తెలిపారు.
పవన్ వెనుక ఉన్నవారంతా టీడీపీ తొత్తులే అని ఆరోపించారు. గత ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పినవారికే పవన్ సీట్లు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌లు దొంగ నాటకాలు ఆపాలని అన్నారు. పవన్ చేష్టలు అపహాస్యంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. పవన్ లాంగ్‌మార్చ్‌లో టీడీపీ కార్యకర్తలు తప్ప ఎవరు లేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు విష కౌగిలి నుంచి పవన్ బయటకు రావాలని సూచించారు.