తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏ అంశంపైనైనా ఆయన వైఖరిని సూటిగా, స్పష్టంగా చెప్పలేని దుస్థితిలో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కె.శ్రీనివాసులు ఎద్దేవా చేశారు.
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గడికోట, శ్రీనివాసులు ఎద్దేవా
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏ అంశంపైనైనా ఆయన వైఖరిని సూటిగా, స్పష్టంగా చెప్పలేని దుస్థితిలో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కె.శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు తెలంగాణ అంశంపై యూ టర్న్ తీసుకోలేదని, ప్రజల టర్న్ తీసుకున్నానని చెబుతున్నారని, అయితే ప్రజల టర్న్ ఏమిటన్నది మాత్రం ఆయన సూటిగా చెప్పరని దుయ్యబట్టారు.
చంద్రబాబు ఎందుకు ఢిల్లీ వెళ్లారన్న విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసు విషయంలో మాట్లాడేందుకు అపాయింట్‌మెంట్ కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాసిన చంద్రబాబు... రాష్ట్ర పరిస్థితులపై రాష్ట్రపతితో మాట్లాడానని బయటకు వచ్చి చెప్పారన్నారు. బీజేపీతో పొత్తు కోసం లోపాయికారీగా ప్రయత్నాలు సాగిస్తూ కూడా ఆ విషయాన్ని నేరుగా చెప్పుకోలేని పరిస్థితి చంద్రబాబుదని పేర్కొన్నారు.