సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తోన్న అక్రమాల గురించి సాక్ష్యాధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. సీఈసీ సునీల్ అరోరాకి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలలో అక్రమాలకు పాల్పడేందుకు చంద్రబాబు నాయుడు తగిన ఏర్పాట్లు చేసుకున్నారని ఆరోపించారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. నూతన డీజీపీ నియామకం, ప్రస్తుత డీజీపీ తొలగింపు అంశాలతోపాటు ఇంటిలిజెన్స్ విభాగం అధికారి వెంకటేశ్వరరావు, పోలీసు అధికారులు యోగానంద్, విక్రాంత్ పాటిల్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఈసీ దృష్టికి తీసుకెళ్లామని విజయసాయిరెడ్డి తెలిపారు.
పోలీసు విభాగంలో 37 మంది అధికారులకు పదోన్నతి కల్పించారని, సూపర్ న్యూమరీ ద్వారా కొంత మంది అధికారులను ఎలివేట్ చేశారని ఆయన వెల్లడించారు. చట్ట వ్యతిరేకంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లా ఎస్పీలుగా నాన్ క్యాడర్ ఆఫీసర్‌లను నియమించారని పేర్కొన్నారు. పోలీసుల సాయంతో డబ్బును ఓటర్లకు పంచేందుకు వీలుగా తగిన బందోబస్తును ఏర్పాటు చేసి తరలిస్తున్నారని ఆరోపించారు. శ్రీకాకుళంలో నారాయణ కాలేజీ నుంచి కారులో డబ్బు తరలిస్తుండగా ఎమ్మార్వో పట్టుకున్నారని, తీరా ఎన్నికల సామాగ్రి ఉందని అధికారులు బుకాయించారని మండిపడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులు అనుసరిస్తోన్న విధానాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు.
వైఎస్సార్‌సీపీ నేతలు ఫోన్లను అక్రమంగా టాపింగ్ చేస్తున్నారని, దీనికి సంబంధించిన ఆధారాలను ఈసీకి అప్పగించామని ఆయన తెలిపారు. ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్ రెక్కలు వైఎస్సార్‌సీపీ ఫ్యానుతో పోలి ఉందని, ఆ గుర్తును మార్చాలని ఈసీకి విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. ప్రజాశాంతి పార్టీ కండువా కూడా తమ పార్టీలా మూడు రంగులు కలిగి ఉందని గుర్తు చేశారు. చంద్రబాబుతో అనైతిక సయోధ్య వల్లే కేఏ పాల్ మోసానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అక్రమాల గురించి సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఈసీ ఉన్నతాధికారులకు మరోసారి వివరిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment