ఆర్డినెన్స్ ద్వారానైనా నీళ్లివ్వండి: అవినాష్ రెడ్డి
న్యూఢిల్లీ: రాయలసీమలో నీటి ఎద్దడి ప్రమాదకర పరిస్థితులను తలపిస్తోందని, ఆర్డినెన్స్ ద్వారానైనా ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు అందేలా చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని కోరింది. ఆ పార్టీ ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో సంబంధిత అంశాన్ని లేవనెత్తారు.
‘కృష్ణా జలాల పంపిణీ విషయంలో ట్రిబ్యునళ్లు నదీ పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాల మధ్య అప్పటివరకు ఉన్న ప్రాజెక్టులకు నికరజలాలను పంపిణీ చేయడంలోనే దృష్టి పెట్టాయి. అమలులో ఉన్న ప్రాజెక్టుల విషయంలో దృష్టిపెట్టలేదు. ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతితక్కువ వర్షపాతం ఉంటుంది. ఇది పూర్తిగా కరువు ప్రాంతం. ఇక్కడ తాగునీరు దొరకడమే అతిపెద్ద సవాలు. ఈ విషయాన్ని పట్టించుకోనందుకు ట్రిబ్యునళ్లను తప్పుపట్టలేం. ఎందుకంటే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం రాష్ట్రాలు, ప్రాజెక్టుల మధ్య నీటి పంపకాలను మాత్రమే నిర్ధేశించింది. కానీ కరువు బారిన పడుతున్న ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.
వేలాది గ్రామాలు, పట్టణాలకు కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఇక్కడి రైతుల పరిస్థితి దయనీయం. ఇక్కడి సాగు పూర్తిగా వర్షాధారితం. వర్షపాతం అతి తక్కువ. అందువల్ల చాలా ఏళ్లుగా ఇక్కడి రైతులు జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, వెలిగొండ తదితర ప్రాజెక్టులకు నికర జలాలను కేటాయించాలని, తాగునీరు అందించాలని, రైతుల జీవనోపాధికి వీలుగా సాగునీరు అందించాలని కోరుతున్నారు. అందువల్ల కేంద్రం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు ప్రత్యేక సూచన చేయాలని కోరుతున్నా. ఒకవేళ అది చట్టబద్ధం కానిపక్షంలో కేంద్రం ఒక ఆర్డినెన్స్ జారీచేసి కరువు ప్రాంతాలకు నీళ్లు కేటాయించి ప్రజల ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కును కాపాడాలి..’ అని కోరారు.
దీనికి కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి సంజీవ్ బలియాన్ సమాధానం ఇస్తూ ‘ఏ జిల్లాకు ఎంత నీరివ్వాలన్నది ఆయా రాష్ట్రాలే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ట్రిబ్యునల్ విచారణ జరుపుతోంది..’ అని పేర్కొన్నారు.