వచ్చే నెల 8న వైఎస్సార్‌సీపీ తెలంగాణ జిల్లాల భేటీ
పార్టీ తెలంగాణ కమిటీ సభ్యుడు జనక్‌ప్రసాద్ వెల్లడి
హైదరాబాద్ : తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పటిష్టం చేసేందుకు.. వచ్చేనెల 8న హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ సమీపంలో గల క్రిస్టల్ ఫంక్షన్‌హాలులో పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ సభ్యుడు జనక్‌ప్రసాద్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు.. తెలంగాణలో వైఎస్సార్‌సీపీని ప్రజాబలమున్న పటిష్టపార్టీగా రూపుదిద్దేందుకు చర్యలు చేపడతారని ఆదివారం ఆయన మీడియాకు చెప్పారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పార్టీ రాష్ట్రకమిటీ సభ్యులు కె.శివకుమార్ పాల్గొన్నారు. పార్టీ నిర్మాణంలో భాగంగా నిర్వహించనున్న ఈ విస్తృత సమావేశం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్ఢి అధ్యక్షతన జరగనుందన్నారు. ఈ సమావేశానికి తెలంగాణలోని పది జిల్లాల్లోని నాయకులు, సీజీసీ, పీయూసీ, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీచేసిన వారు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లుగా పోటీచేసిన అభ్యర్థులు, అధికార, ప్రజాసంఘాల నాయకులు పాల్గొంటారని ఆయన తెలియజేశారు.
ఈ సమావేశానికి పైన పేర్కొన్న నాయకులంతా హాజరుకావాలని కోరారు. ఈ నెల 26న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గసమావేశంలో పార్టీ పటిష్టత, భవిష్యత్‌తో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించి, 8న విస్తృతసమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమలు తెలంగాణలో ఏ విధంగా జరుగుతున్నది, వాటిపై అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ విస్తృతస్థాయి భేటీలో చర్చించనున్నట్లు జనక్‌ప్రసాద్ తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆందోళ న కార్యక్రమాలను చేపట్టేందుకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు. పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్‌లో నూతన కార్యక్రమాలను చేపట్టే విషయంపై విస్తృతభేటీలో చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమాల విజయం కోసం రాష్ర్ట కమిటీ సభ్యులను జిల్లాల ఇన్‌చార్జీలుగా పార్టీ నాయకత్వం నియమించిందని జనక్‌ప్రసాద్ చెప్పారు.