గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు గడిచిన మూడేళ్లలో సాగించిన అవినీతిపై ముద్రించిన ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఈ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో సీఎం చంద్రబాబు చేసిన అవినీతిపై ఆధారాలతో సహా ఈ పుస్తకాన్ని ముద్రించడం జరిగిందన్నారు.
ఆయన సాక్ష్యాత్తూ రూ.3 లక్షల 75వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. అందులో లక్షకోట్ల కుంభకోణంలో ఒక్క రాజధాని ప్రాంతం భూముల మీద అయితే, మరొకటీ విశాఖలో భూముల మీద జరిగిన కుంభకోణం అన్నారు. ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కాంట్రాక్టులకు సంబంధించి అన్ని ఆధారాలతో ఈ పుస్తకాన్ని రూపొందించామన్నారు. ఈ పుస్తకాన్ని ప్రతి గ్రామంలోకి తీసుకు వెళ్లాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు సూచించారు.
వాస్తవానికి చంద్రబాబు ‘అవినీతి చక్రవర్తి’ పేరుతో వైఎస్‌ఆర్ సీపీ ఏడాది కిందటే ఒక పుస్తకాన్ని ప్రచురించింది. అయితే ఈ ఏడాది కాలంలో చోటు చేసుకున్న మిగిలిన అన్ని కుంభకోణాలను జతచేసి, గత కుంభకోణాల జమా లెక్కలను అప్‌డేట్ చేసి ఈ పుస్తకాన్ని పునర్ముద్రించింది. మొత్తం 56 కుంభకోణాలకు సంబంధించి అవినీతి చోటు చేసుకున్నది అది తేల్చినట్లు తెలుస్తోంది.