
అబద్ధాల బాబుకు బుద్ధి చెబుదాం!
పదేళ్ల పాటు దూరమైన అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు చంద్రబాబు ఆడని అబద్ధాలు, ఇవ్వని హామీలు లేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు.
పదేళ్ల పాటు దూరమైన అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు చంద్రబాబు ఆడని అబద్ధాలు, ఇవ్వని హామీలు లేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు. ఆచరణకు సాధ్యంకాని హామీలతో ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెబుదామని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ మోసాలు, అక్రమాలపై ప్రజలను చైతన్యం చేయాలన్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీని మట్టికరిపించి జగన్ నాయకత్వంలో మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకునేవరకూ నిద్రపోకూడదని దిశానిర్దేశం చేశారు. బుధవారం శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన పార్టీ జిల్లాస్థాయి ప్లీనరీ విజయవంతమైంది. ఉద్వేగంగా సాగిన నాయకుల ప్రసంగాలు శ్రేణుల్లో నూతనోత్సాహం నింపాయి.
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం/శ్రీకాకుళం అర్బన్:గడిచిన మూడేళ్లలో చోటుచేసుకున్న రాజకీయ పరి ణా మాలను విశ్లేషించి, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై శ్రే ణులకు దిశానిర్దేశం చేయడానికే ప్లీనరీ సమావేశాలు నిర్వహించడం ప్రజాస్వామ్యంలో సంప్రదాయమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు వివరించారు. ప్లీనరీ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ... ప్లీనరీలో చర్చించిన అంశాలను, ఆమోదించిన తీర్మానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యం చేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులందరిపై ఉందన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వచ్చేనెల 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద జరిగే పార్టీ జాతీయ స్థాయి ప్లీనరీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీకి మూడేళ్ల హానీమూన్ ముగిసిపోయిందన్నారు. ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేక మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు ముఖం చూపించలేక తప్పించుకు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. వారిని నిలదీసి ప్రజల తరఫున గళం వినిపించాల్సిన బాధ్యత ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ఉందన్నారు. అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష పార్టీ బాధ్యత బాధ్యతాయుతమైనదీ, గౌరవనీయమైనదీ అని వివరించారు. గత ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ ఓడిపోయిందనే నిరాశ తగదన్నారు. ఒక సీటు నుంచి పదిహారుకు, అక్కడి నుంచి 67 స్థానాలకు పార్టీ దినదిన ప్రవర్థమానం చెందిందన్న విషయాన్ని గుర్తించాలన్నారు.
వచ్చే ఎన్నికలలో ఆ సంఖ్య 127కి పెరుగుతుందని, 147కి చేరినా చేరవచ్చని ధీమా వ్యక్తం చేశారు. ఈ మూడేళ్లలో రాజధాని అమరావతిని గ్రాఫిక్స్‌లో చూపించేస్తూ కాలం గడిపేసిన చంద్రబాబే ఇప్పుడు వాటిని పూర్తి చేయాలంటే వచ్చే ఎన్నికలలోనూ తనను గెలిపించాలని ప్రజల ముందుకు వెళ్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన నాటికి రాష్ట్రంపై రుణభారం రూ.96 వేల కోట్లు ఉందని, ఈ మూడేళ్లలో మరో రూ.1.16 లక్షల కోట్లు అప్పులు చేసేసి రాష్ట్రాన్ని మరింత ఆర్థిక సంక్షోభంలోకి చంద్రబాబు నెట్టేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ అప్పుల్లో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ఎంత మొత్తం కేటాయించారని ప్రశ్నిస్తే టీడీపీ నాయకుల దగ్గర సమాధానం లేదన్నారు. జిల్లా అభివృద్ధి అంటే మంత్రి అచ్చెన్న ఇంట్లోనో, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఇంట్లోనో జరిగింది కాదన్నారు.
పేద ప్రజల కడుపు నింపడానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను చంద్రబాబు ప్రభుత్వం పచ్చచొక్కాల జేబులు నింపడానికి మళ్లిస్తోందని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి పనులకు బదులు సిమెంట్ రోడ్లను వేసేసి 40శాతం నిధులు నొక్కేస్తున్నారని విమర్శించారు. జన్మభూమి కమిటీల దోపిడీ చంద్రబాబుకు తెలియనిది కాదని, ఎన్నికలకు ముందు మాత్రం ‘అయ్యో అంత దోపిడీ చేశాయా? వాటిని రద్దు చేస్తున్నా’ అని సన్నాయి నొక్కులు నొక్కుతారని చెప్పారు.
ఈ మూడేళ్ల పరిపాలనలో 1100 అంటే సగటున రోజుకొకటి చొప్పున రహస్య జీవోలిచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. ఇప్పటివరకూ మన రాష్ట్రంలోనే కాదు దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇలాంటి దొంగ పాలన చూడలేదన్నారు. ఈ ప్రభుత్వ అక్రమాలను, అన్యాయాలను శాసనసభలో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి నిలదీస్తున్నారని, ప్రజల్లోకి వెళ్లి దీక్షలు చేస్తున్నారని ప్రస్తావించారు. మిగతా శ్రేణులు కూడా ఎక్కడికక్కడ టీడీపీ అక్రమాలను నిలదీయాలని పిలుపునిచ్చారు.
అబద్ధాలే బాబును కాటేసే పాములు
ప్లీనరీకి ముఖ్య అతిథిగా వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాడు అధికారానికి సోపానాలైన అబద్ధాలే ఇప్పుడు చంద్రబాబును పాములై కాటేయబోతున్నాయని జోస్యం చెప్పారు. రైతుల రుణమాఫీ దీనికొక ఉదాహరణ అన్నారు. ‘రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల రీత్యా సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకొన్న తర్వాతే రైతుల రుణాల మాఫీ చేయలేమని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తేల్చి చెప్పేశారు. సీనియర్ రాజకీయ నాయకుడినని చెప్పుకొనే చంద్రబాబుకూ ఈ విషయం తెలియనిది కాదు. రూ.84 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేయాల్సింది పోయి రకరకాల సాకులతో ఈ మూడేళ్లలో కేవలం రూ.9 వేల కోట్లు మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం తీర్చింది.
ఎన్నికల లబ్ధి కోసం ఆయన చేసిన మోసాలను ప్రజలు గ్రహించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి బుద్ధి చెప్పి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టాలనే నిర్ణయానికి వచ్చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాజకీయాలను నేరమయం చేసేసిన టీడీపీకి తగిన శాస్తి తప్పదు. నవనిర్మాణ దీక్షలు, విదేశీ పర్యటనలకు ప్రత్యేక విమానాలు, నీరు–చెట్టు వంటి జేబులు నింపే పథకాలతో ప్రజాధనాన్ని చంద్రబాబు ప్రభుత్వం దుబారా, దుర్వినియోగం చేస్తోంది. మరోవైపు నిధులు లేవంటూ ఆరోగ్యశ్రీ, 108, 104 వాహనాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాలను నీరుగార్చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నాటి పేదల సంక్షేమరాజ్యం మళ్లీ రావాలంటే జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఎంతైనా ఉంద’ని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో ప్లీనరీ సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4.30 గంటల వరకూ కొనసాగింది. తొలుత పార్టీ జెండాను రెడ్డి శాంతి ఆవిష్కరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ప్లీనరీలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం, పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, కంబాల జోగులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు గొర్లె కిరణ్, పేరాడ తిలక్, నర్తు రామారావు, డాక్టర్ సీదిరి అప్పలరాజు తదితర నాయకులు ప్రసంగించారు. జిల్లా సమస్యలు, ప్రభుత్వ వాగ్దానాల భంగంపై పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు పాలవలస రాజశేఖరం మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవడం అందరి బాధ్యత అని పార్టీ శ్రేణులను కోరారు.
పార్టీ సీఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ బూత్ స్థాయి నుంచి పార్టీని నిర్మాణాత్మకంగా ఎన్నికల దిశవైపు నడిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు, జడ్పీ మాజీ చైర్మన్ వైవీ సూర్యనారాయణ, జడ్పీ ఫ్లోర్‌లీడర్ ధర్మాన పద్మప్రియ, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రధాన రాజేంద్ర, శ్రీకాకుళం మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్‌లు అంధవరపు వరం, ఎంవీ పద్మావతి, డాక్టర్స్ సెల్ జిల్లా కన్వీనర్ పైడి మహేశ్వరరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు టొంపల సీతారాం, జిల్లా అధికార ప్రతినిధులు సిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయ్, పార్టీ నేతలు మామిడి శ్రీకాంత్, కోణార్క్ శ్రీను, తమ్మినేని చిరంజీవినాగ్, మండవిల్లి రవి, గుమ్మా నగేశ్, గొండు కృష్ణమూర్తి, మార్పు ధర్మారావు, పీస శ్రీహరి, సువ్వారి గాంధీ, సనపల నారాయణరావు, బల్లాడ జనార్దనరెడ్డి, పి.కామేశ్వరి, గొర్లె రాజగోపాల్, కేఎల్ ప్రసాద్, సురంగి మోహనరావు, కిల్లి లక్ష్మణరావు, తదితర నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు కళావతి, జోగులును ఘనంగా సన్మానించారు.
జగన్‌ను సీఎం చేద్ధాం
టీడీపీ నాయకులు స్వార్థ చింతనతో జిల్లా అభివృద్ధిని పాతాళానికి తొక్కేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రోటోకాల్ నిబంధనలను సైతం ఉల్లంఘించి అడుగడుగునా అవమానాలకు గురి చేస్తున్నారు. సంక్షేమ పథకాల సహా అన్ని పనులు జన్మభూమి కమిటీలకు అప్పగించేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేస్తున్నారు. జిల్లా మంత్రులు సైతం జిల్లా ప్రజల పట్ల బాధ్యతారాహిత్యంగానే వ్యవహరిస్తున్నారు. మన్యం ప్రజలు జ్వరాల బారిన పడుతుంటే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. గిరిజనులు మనుషులు కాదా? మళ్లీ రాజశేఖరుడి పరిపాలన రావాలంటే జగన్‌ను సీఎం చేద్దాం.
– విశ్వసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే
వైఎస్ పాలనలో రైతురాజ్యం...
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ఆరేళ్లలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. రైతు రాజ్యం ఎలా ఉండాలో చేసి చూపించారు. టీడీపీ పాలన మాత్రం అందుకు భిన్నంగా ఉంది. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేశారు. నాసిరకం విత్తనాలను అంటగడుతోంది. ఈ దగా ప్రభుత్వాన్ని గద్దె దించాలి. రైతు, కార్మిక, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కావాలంటే జగన్ నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది.
– కంబాల జోగులు, రాజాం ఎమ్మెల్యే
ప్రజలను చైతన్యం చేయడమూ బాధ్యతే....
ప్రజలను వంచించడం చంద్రబాబుకు కొత్తకాదు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్యం చేయడాన్ని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఒక బాధ్యతగా తీసుకోవాలి. పార్టీని మరింత పటిష్టం చేయాలి. వచ్చే ఎన్నికలలో జిల్లాలోని ఎంపీ సహా పది ఎమ్మెల్యే స్థానాల్లోనూ పార్టీ విజయకేతనం ఎగురవేయాలి. – ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు