రాష్ట్రంలో దోపిడీ పాలన
ఎచ్చెర్ల క్యాంపస్ : దోచుకోవడం, దాచుకోవడానికే తెలుగుదేశం నాయకులు ప్రాధాన్యమిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. చిలకపాలెంలో గురువారం ఎచ్చెర్ల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాకుళం అంటే టీడీపీ ప్రభుత్వానికి చిన్నచూపు ఉందని విమర్శించారు. అమరావతి, భోగాపురంలలో ల్యాండ్ పూలింగ్‌లో అనేక ప్రయోజనాలు కల్పించిన ప్రభుత్వం కొవ్వాడ విషయంలో నిరుపేదల భూములు అక్రమంగా, చౌకగా దోచుకుంటోందని దుయ్యబట్టారు. మంత్రి కళావెంకటరావు అనుచరులు దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
కొవ్వాడ అణుపార్కుకు సంబంధించి ప్రభుత్వ భూములను దోచుకుంటున్నా సర్కారు చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. దివాలా సంస్థ వెస్టింగ్ హౌస్‌కు పనులు అప్పగించడం దారుణమన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో గెలుపొంది వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర హైవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ప్రస్తుతం టీడీపీ అంపశయ్యపై ఉందన్నారు. పార్టీ సమావేశాలకు సైతం డబ్బులు పెట్టి ప్రజలను తరలిస్తున్నారని విమర్శించారు. గడపగడపకు వైఎస్సార్‌లో ప్రభుత్వ వైఫల్యాలు బయటపడ్డాయని చెప్పారు.
ఎచ్చెర్ల నియోజకవర్గంలో 2019లో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేయటం ఖాయమన్నారు. పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు, తటస్థుల ఓట్లు వైఎస్సార్ సీపీకి పడేలా సన్నద్ధం కావాలన్నారు. బూత్ కమిటీల నుంచే సమర్థ నాయకత్వం ఉండాలన్నారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతృత్వ ప్రభుత్వం ఉందన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో లేని రాష్ట్ర మంత్రి కళావెంకటరావు దోపిడీని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కొవ్వాడ అణుపార్కు భూముల్లో జరుగతున్న అక్రమాలే ఇందుకు ఉదాహరణగా వివరించారు. ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ప్రభుత్వ వైఫల్యాలపై తీర్మానాలు..
ప్రభుత్వ వైఫల్యాలపై చేసిన తీర్మానాలు, ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు అమలు తీరుపై నాయకులు విశ్లేషణలు ఆకట్టుకున్నాయి. కార్యకర్తలు చప్పట్లతో తమ మద్దతు తెలియజేశారు. ఉపాధి హామీ అక్రమాలపై సీనియర్ నాయకులు గొర్లె అప్పలనాయుడు, జన్మభూమి కమిటీలు వైఫల్యంపై ఎచ్చెర్ల మండల అధ్యక్షుడు సనపల నారాయణరావు, నీరు–చెట్టు, బెల్టు షాపులు, ఇసుక విధానంపై రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి బల్లాడ జనార్దన రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌పై జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు టొంపల సీతారాం, అణుపార్కుపై రణస్థలం పార్టీ అధ్యక్షుడు పైడి శ్రీనివాసరావు, భూగర్భజల కాలుష్యంపై మూగి శ్రీరాములు, డ్వాక్రా సంఘాలకు జరుగుతున్న అన్యాయంపై లావేరు పార్టీ అధ్యక్షుడు దన్నాన రాజీనాయుడు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రణస్థలం జెడ్పీటీసీ సభ్యుడు గొర్లె రాజగోపాల్, ఆరోగ్య శ్రీ, 104, 108 వైఫల్యాలపై బొందు సూర్యనారాయణ, రైతులు, కూలీల సంక్షేమ వైఫల్యంపై జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు రొక్కం బాలకృష్ణ, ప్రజాసంక్షేయ పథకాల అమలు వైఫల్యంపై కేవీవీ సత్యనారాయణ చేసిన ప్రసంగాలు, విశ్లేషణలు ఆకట్టుకున్నాయి. జన్మభూమి కమిటీలు తీవ్రవాదుల కంటే ప్రమాదంగా మారారని, నీరు–చెట్టు పనుల పేరుతో కళావెంటకరావు బినామీ విశ్రాంత ఉద్యోగి మహేష్ దోచుకుంటున్నారని ఘాటైన విమర్శలు చేశారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శులు పిన్నింటి సాయికుమార్, మాడుగుల మురళీధర్‌బాబా, నాయకులు నక్క కృష్ణమూర్తి, ప్రసాద్, మీసాల అప్పారావు, కేఎల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.