రాజధాని పేరుతో రైతులకు బెదిరింపులా?
రాజధాని పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులను సీఎం చంద్రబాబు నాయుడు భయాందోళనలకు గురిచేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్థ సారథి మండిపడ్డారు. చంద్రబాబుకు మైండ్ సెట్ ఇప్పటికీ మారలేదని ఆయన అన్నారు. రైతులను చులకన చేసి మాట్లాడటం ఆయనకు తగదని చెప్పారు. రైతులది అత్యాశ అంటూ కించపరచడం ఎంతవరకు సమంజసమని సారథి ప్రశ్నించారు. రాజధాని వస్తుందన్న వార్తల వల్లే భూముల ధరలు బంగారంలా పెరిగిపోయాయని, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కావాలో, భూసేకరణ చట్టం ప్రయోగించమంటారో తేల్చుకోవాలని రైతులను ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు.
ఇప్పుడు మళ్లీ కాల్దరి, బషీర్బాగ్ కాల్పులు పునరావృతం అవుతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారని సారథి అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే ల్యాండ్ మాఫియా పేట్రేగిపోతోందని, భూసేకరణ పేరుతో రైతులను బెదిరించడం సరికాదని ఆయన చెప్పారు. చేతనైతే కేంద్రాన్ని బెదిరించి రాజధానికి అవసరమైనవి సాధించాలని సూచించారు. ప్రభుత్వ దౌర్జన్యాలు ఇలాగే కొనసాగితే వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని, రైతులకు అండగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సారథి అన్నారు.