ధర్నాగ్రహం | YSRCP to hold Dharnas across AP against Chandra Babu | Sakshi
Sakshi News home page

ధర్నాగ్రహం

Published Thu, Nov 6 2014 2:10 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

YSRCP to hold Dharnas across AP against Chandra Babu

మాటిచ్చి మరిచిపోయిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్‌ఆర్ సీపీ పిడికిలి బిగించింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిబంధనల పేరుతో కాలయాపన చేస్తున్న సర్కారు తీరుకు నిరసనగా రోడ్డెక్కి ధర్నాలు నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా బుధవారం వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల సహకారంతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇచ్చిన హామీలను మరిచిపోయిన ప్రభుత్వం కళ్లు తెరిచేలా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హామీలు అమలయ్యే వరకు ప్రజల తరఫున పోరాటాలు కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు.
 
  వైఎస్‌ఆర్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స
 నెల్లిమర్ల: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా పోరాటం చేద్దామని వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు పిలుపునిచ్చారు. రైతు, డ్వాక్రా రుణమాఫీలు అమలు చేయకపోవడాన్ని వ్యతిరేకిస్తూ నెల్లిమర్లలో బుధవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక మొయిద జంక్షన్ నుంచి వందలాది మంది పార్టీ కార్యకర్తలు, నేతలు ర్యాలీగా బయలుదేరి తహశీల్దారు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ గంటపాటు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సాంబశిరాజు మాట్లాడారు. మొదటి సంతకంతోనే చంద్రబాబు మోసాలు మొదలుపెట్టారని అన్నారు. ఇప్పటికే ప్రజల్లో ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందని చెప్పారు. సర్వే పేరుతో అర్హులైనవారి పింఛన్లు తొలగించారని ఆరోపించారు. హామీలు నెరవేర్చేదాకా ఆందోళన కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీబీ ఉపాధ్యక్షుడు చెనమల్లు వెంకటరమణ, జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం మెడలు వంచైనా.. ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చేద్దామన్నారు.  అనంతరం హెచ్‌డీటీ రమాదేవికి పెనుమత్స, చెనమల్లు, గదల తదితరులు వినతిపత్రం అందజేశారు.
 
 అన్ని వర్గాలనూ మోసం చేశారు
  బొబ్బిలి ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సుజయ్
 బొబ్బిలి: మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు అన్ని వర్గాలనూ మోసం చేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు. చంద్రబాబు హామీలు అమలు కాకపోవడాన్ని నిరసిస్తూ బొబ్బిలిలో బుధవారం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రుణ మాఫీ సాధ్యం కాదని ముందు చూపుతో జగన్‌మోహన్ రెడ్డి చెబుతుంటే ఇదే చంద్రబాబు ఎగతాళి చేశారని, ఇప్పుడు ఐదు నెలలు అయినా కమిటీలు, నిబంధనలు పేరుతో రుణమాఫీ చేయకుండా నానుస్తున్నారని అన్నారు. వైఎస్ ఆ రోజు ప్ర మాణస్వీకారం నాడు ఉచిత విద్యుత్‌పై సంతకం చేస్తే మరుసటి రోజు నుంచే అమలయ్యిందని, చంద్రబాబు చేసిన తొలి సంతకాలే అబద్దం అని తేలిపోయాయన్నారు. రుణమాఫీపై సాధికార సంస్థ ద్వారా చేసేదేమిటో, వడ్డీ ఎవరు కడతారు, వడ్డీకి ఎంత కడుతున్నారో వంటి వాటిపై స్పష్టత ఇవ్వాలన్నారు. లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పరిధిలో రైతులకు క్రషింగు సమయం ముంచుకొస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదని తెలిపారు.  
 
 దొడ్డిదారిలో పదవులు...
 బొబ్బిలి నియోజకవర్గంలో అత్యధిక మంది ప్రజాప్రతినిధులను వైఎస్‌ఆర్ కాంగ్రె స్ పార్టీకి చెందిన వారినే ఎన్నుకొని పట్టం కట్టారని, అయితే మండలాలు, మున్సిపాలిటీల్లో దొడ్డిదారిన పదవులను అలకరించారని సుజయ్ విమర్శించారు. అధికార పార్టీ ఒత్తిడిలకు తలొగ్గి అర్హులకు అధికారులు అన్యాయం చేస్తే సహించబోమన్నారు.
 
 కోట నుంచి ర్యాలీ... రహదారి దిగ్బంధం
 చంద్రబాబు హామీల అమలు కాకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్చిన పిలుపుమేరకు బొబ్బిలి పట్టణ, మండల నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ఆర్వీ సుజయకృష్ణ రంగారావు ఆధ్వర్యంలో కోట నుంచి ర్యాలీగా బయలుదేరారు. వేణుగోపాలస్వామి జంక్షన్, పార్కు పక్క నుంచి తహశీల్దార్ కార్యాలయానికి తరలివచ్చారు. అక్కడ బలిజిపేట రోడ్డును దిగ్బంధం చేశారు. దీంతో దాదాపు రెండు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి.
 
 ప్రజల చెవిలో పూలు పెడుతున్నారు  సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర
 సాలూరు: ఎన్నికల సమయంలో హద్దులు లేకుం డా హామీలు గుప్పించిన టీడీపీ ప్రభుత్వం అధికారం వచ్చాక మాత్రం ప్రజలు చెవిలో పూలు పెడుతోందని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే ఇంటి నుంచి జాతీయ రహదారి మీదుగా తహశీల్దార్ కార్యాలయం జంక్షన్ వరకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు తీరుపై పె ద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జంక్షన్‌లో రాస్తారోకో నిర్వహించారు. తర్వాత రాజన్నదొర మా ట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని, ప్రమాణ స్వీకారం నాడు కూడా సంతకాలు చేశారని, కానీ వాటిలో ఓ ఒక్కదాన్నీ అమలు చేయలేదని ధ్వజమెత్తారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు కట్టవద్దని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్లూ ఆధార్ వద్దని చెప్పి న చంద్రబాబు నేడు అన్నింటికీ ఆధార్‌తో ముడిపెడుతున్నారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు అధికార పార్టీ తీరుపై ఆగ్రహంగా ఉన్నారని అన్నారు.  
 
 ఎంతకాలం మోసం చేస్తారు..?
  వైఎస్‌ఆర్ సీపీ సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు
 భోగాపురం : డ్వాక్రా, వ్యవసాయ, చేనేత రుణాలు మాఫీ అంటూ ఇంకా ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారని ప్రభుత్వాన్ని వైఎస్‌ఆర్ సీపీ సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు ప్రశ్నించారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం ఆవరణలో శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఈ రోజు వరకు ఎక్కడా రుణమాఫీ చేయలేదని తెలిపారు. జిల్లాలో తుపాను తాకిడికి నెల్లిమర్ల నియోజకవర్గంలో భోగాపురం, పూసపాటిరేగ మండలాల రైతులు తీవ్రంగా నష్టపోయారని, అయితే పంటలు కోల్పోయిన రైతులు ప్రభుత్వం మాటలు విని సకాలంలో రుణాలు కట్టనందున బీమా సొమ్ముని నష్టపోయారని తెలిపారు. అనంతరం డీటీ ప్రభాకరరావుకి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రావాడ బాబు, శిరుగుడి గోవిందరావు, వరుపుల సుధాకర్, కొమ్మూరు సుభూషణరావు, సవరవిల్లి శ్రీనివాసరావు, ఇమ్మిడిశెట్టి రమేష్,  మద్దిల శంకరరావు, కర్రోతు పైడిరాజు, మైలపల్లి అప్పలకొండ, నారు పైడినాయుడు, శ్రీనువాసు, రాంబాబు పాల్గొన్నారు.
 
 మాట ఇచ్చారు... మరిచిపోయారు  కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
 కురుపాం: ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా కుప్పలుతెప్పలుగా హామీలు గుప్పించిన చంద్రబాబు నేడు మాట తప్పి మడమ తిప్పారని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. మండల కేంద్రంలో వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అధ్యక్షతన బుధవారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె రావాడ కూడలిలో ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి పార్టీ కురుపాం మండలాధ్యక్షురాలు ఆనిమి ఇందిరాకుమారి, జెడ్పీటీసీ శెట్టిపద్మావతిలతో కలిసి పూలమాలలు వేశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.  బస్టాండ్  కూడలిలో మానవహారంగా నిలబడి ధర్నా చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సాంబమూర్తికి వినతిపత్రం అందించారు. హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ఈ ఆటలు ఎన్నాళ్లు సాగిస్తారని ప్రశ్నించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement