‘‘ప్రజాస్వామిక వ్యవస్థలను ధ్వంసం చేయడంలో నాలుగున్నరేళ్ల నారా చంద్రబాబునాయుడి పాలన గిన్నీస్‌ను తలదన్నేలా రికార్డులను సృష్టించింది.రాజకీయ – పరిపాలనా వ్యవస్థలను అవినీతి క్యాన్సర్ కబళిస్తోంది. పంచాయతీల స్వపరిపాలన కోమాలో ఉంది. ఫిరాయింపుల నిరోధక చట్టానికి పాడె కట్టారు.గ్రామీణ ఆర్థిక రంగానికి ఊపిరిలూదుతున్న డ్వాక్రా వ్యవస్థకు వెన్నుపోటు పొడిచారు. ప్రజా రక్షణకు ప్రాణవాయువుగా నిలవాల్సిన ఇంటెలిజెన్స్ బృందాన్ని సొంత పనులకు, రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ కనుసన్నల్లో నడిచేలా చేశారు. ఒక్కటేమిటీ?.. సర్వ రంగాల్లో సాగిన ఈ ధ్వంస రచనకు యావద్దేశంలోనే సాటి లేదు.’’
డ్వాక్రా ఢమాల్..
హామీ ఇచ్చినట్లుగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేయకపోవడంతో డ్వాక్రా మహిళా సంఘాల వ్యవస్థ అప్పులతో కుప్పకూలింది. ప్రభుత్వం బ్యాంకులకు సున్నా వడ్డీ బకాయిలు చెల్లించకపోవడంతో మహిళలపై రూ.2,275 కోట్ల వడ్డీ భారం పడింది.
ఫిరాయింపుల నిరోధక చట్టం తుంగలోకి..
ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు సంతల్లో పశువుల్లా ఒక్కొక్కరికి రూ.30 కోట్ల వరకు వెచ్చించి కొనుగోలు చేసి ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అవహేళన చేస్తూ పదవులు, ఇతర ప్రయోజనాలు కల్పించారు. దీనిపై స్పీకర్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మావోల చేతుల్లో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు టీడీపీలోకి ఫిరాయించేలా భారీ మొత్తాన్ని చెల్లించినట్లు వెలుగులోకి రావడం తెలిసిందే.
స్థానిక సంస్థలపై ‘జన్మభూమి’ పెత్తనం
గ్రామ పంచాయతీలు నిర్వీర్యమయ్యేలా జన్మభూమి కమిటీల పెత్తనాన్ని తెచ్చారు. గ్రామా వసరాల నుంచి లబ్ధిదారుల ఎంపిక దాకా ఆ కమిటీలకే అధికారం అప్పగించి సర్పంచులు, సభ్యులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు. ప్రభుత్వ పథకాలలో లబ్ధిదారులుగా నమోదు చేసుకునేందుకు పలు జిల్లాలకు చెందిన ప్రజలు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది. మండల, జిల్లా, కార్పొరేషన్, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూడా తమ స్వతంత్రతను కోల్పోయాయి.
సొంత పనులకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ
ఇంటెలిజెన్స్ వ్యవస్థను పార్టీ వ్యవస్థగా మార్చిన ఘనత బాబుదే. రాజకీయ వ్యవహారాలను చక్కబెట్టే కార్యక్రమాలతోపాటు తెలంగాణలో ఎన్నికల సర్వేల కోసం నిఘా యంత్రాగాన్ని టీడీపీ సర్కారు వినియోగిస్తోంది. నిఘా వైఫల్యంతోనే ఏవోబీలో మావోలు పుంజుకున్నారు.
అధికార వ్యవస్థలో ఆశ్రిత పక్షపాతం
ఐఏఎస్, ఐపీఎస్‌ల పోస్టిం గుల్లోనూ రాష్ట్ర సర్కారు ఆశ్రితపక్ష పాతం చూపుతోంది. నిజాయితీగా వ్యవహరించే సీనియర్లను పక్కనపెట్టి అడ్డగోలు వ్యవహారాలకు అంగీకరించే వారిని అందలం ఎక్కిస్తోంది. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తనకు అనుకూలంగా వ్యవహరించే సిబ్బందిని నియమిస్తూ పెత్తనం చలాయిస్తోంది.
ప్రతిపక్ష సభ్యులపై వివక్ష
ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిధులు ఇవ్వకుండా సర్కారు వివక్ష ప్రదర్శిస్తోంది. టీడీపీ ఇన్‌ఛార్జ్‌ల పేరుతో నిధులు విడుదల చేస్తోంది. టీడీపీకి అనుకూలమైన అధికారులను నియమించి రాజకీయ పెత్తనాన్ని కొనసాగిస్తోంది.
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం దేశంలో వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టిస్తోందని సీఎం చంద్రబాబు తాజాగా పొలికేకలు పెడుతుండటాన్ని రాజకీయ పరిశీలకులు ఎద్దేవా చేస్తున్నారు. నాలుగున్నరేళ్లు బీజేపీతో అంటకాగి కేంద్రంలో అధికారాన్ని పంచుకున్న సమయంలో వ్యవస్థలన్నీ ఆయనకు సక్రమంగా కనిపించాయా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు తన పాలనలో అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేసి అస్తిత్వాన్ని కూడా కోల్పోయేలా చేశారని విశ్లేషిస్తున్నారు.
- ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలను అంతమొందించడం, హత్యాయత్నాలు, దాడులు కొనసాగించడం టీడీపీ సర్కారుకు నిత్యకృత్యంగా మారింది. రాజధాని ప్రాంతంలో తోటలు తగలబెట్టడం, తుని రైలు దగ్ధం కేసులో ఇతర ప్రాంతాల వారిని దోషులుగా చూపే ప్రయత్నం చేయడంతర్వాత పలాయనం చిత్తగించడం గమనార్హం.
- శాసనసభలో ప్రతిపక్షం నోరు నొక్కేయడానికి శతథా ప్రయత్నించారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు పలుసార్లు అనుచితంగా మాట్లాడారు. మహిళా ఎమ్మెల్యే ఆర్కే రోజాను శాసనసభకు రాకుండా అడ్డుకుని వివక్ష చూపారు.
- పోలవరం, హంద్రీ–నీవా తదితర ప్రాజెక్టుల్లో టీడీపీ సర్కారు అడ్డగోలు దోపిడీకి తెర తీసింది. చట్టవిరుద్ధమైన ప్రతిపాదనలను ఆమోదించేది లేదని ఆయా సమయాల్లో పనిచేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మౌఖికంగా చెప్పినా, రాతపూర్వకంగా ఫైళ్లలో రాసినా చంద్రబాబు ఖాతరు చేయలేదు. హంద్రీ– నీవా సుజల స్రవంతి అంచనా వ్యయాన్ని రూ.6,850 కోట్ల నుంచి రూ.11,722 కోట్లకు పెంచే ప్రతిపాదనలను నాటి సీఎస్‌లు ఐవైఆర్ కృష్ణారావు, టక్కర్ తీవ్రస్థాయిలో వ్యతిరేకించినా పట్టించుకోకుండా ఉత్తర్వులు జారీ చేయించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం టెండర్లలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారంటూ నాటి సీఎస్ దినేష్‌కుమార్ తీవ్రస్థాయిలో రాతపూర్వకంగా పేర్కొన్నా లెక్కచేయలేదు.
- నాలుగు పంటలు పండే భూములున్న ప్రాంతంలో రాజధాని వద్దని శివరామకృష్ణన్ కమిటి చెప్పినా చంద్రబాబు స్వార్థ ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం కృష్ణా నది ఒడ్డున బంగారం పండే 33 వేల ఎకరాలను భూసమీకరణ పేరిట బలవంతంగా లాక్కున్నారు.
- రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును స్విస్ ఛాలెంజ్ విధానంలో సింగపూర్ సంస్థలకు కట్టబెట్టిన ప్రభుత్వం నాటి సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం వ్యక్తం చేసిన అభ్యంతరాలను పట్టించుకోలేదు.
- ఆహార భద్రతకు ముప్పు అని కేంద్ర వారించినా వినకుండా ఒత్తిడి తెచ్చి మరీ 2013 కేంద్ర భూసేకరణ చట్టానికి టీడీపీ సర్కారు సవరణలు చేసి ఆమోదించుకుంది.
- నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా చేతులు ఎత్తే పద్ధతిని ప్రభుత్వం తెచ్చింది. ఉచిత ఇసుక పథకం పేరిట దోపిడీని వ్యవస్థీకృతం చేసింది.
- విపక్షానికి చెందిన గిరిజన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారనే ఉద్దేశంతో టీడీపీ సర్కారు గిరిజన సలహా మండలిని నియమించలేదు. ఫలితంగా గిరిజనుల సమస్యలు పరిష్కారం కావటం లేదు.
- వ్యవస్థలను తనకు అనుకూలంగా వాడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే అధికారులపై దాడులకు సైతం వెనుకాడటం లేదు. తహశీల్దారు వనజాక్షిపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఏమాత్రం తప్పుబట్టకపోగా బాధితురాలైన అధికారినే సీఎం చంద్రబాబు వేలెత్తి చూపడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment