ఆంధ్రజ్యోతిపై కేసు వేస్తాం
వైఎస్సార్‌సీపీ గిరిజన ఎమ్మెల్యేల మండిపాటు
ఘసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/పాలకొండ రూరల్/కురుపాం : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ పరిచయ కార్యక్రమంలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై ఆగ్రహం ప్రదర్శించారంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో బుధవారం వచ్చిన కథనంపై వైఎస్సార్‌సీపీ గిరిజన ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌కు జగన్ పాదాభివందనం చేయడం కూడా ఆ పత్రిక సహించలేకపోయిందని, అందుకే ఇంతలా విషం కక్కిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
క్షమాపణలు చెప్పకపోతే ఆ పత్రికపై ఎస్సీ, ఎస్టీ కేసు వేస్తామని హెచ్చరించారు. ఇంత అన్యాయంగా, దారుణంగా అబద్ధాలు ఎలా రాస్తారని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పాలకొండ, కురుపాం ఎమ్మెల్యేలు కళావతి, పుష్పశ్రీవాణి ప్రశ్నించారు. బుధవారం వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ కు తమను పేరు పేరునా జగన్ పరిచయం చేశారని ఆమె తెలిపారు.
జగనే వెంకయ్యను కలవమన్నారు
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో తాము ఫొటోలు దిగడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోయారని రాయడం దుర్మార్గమని ఈశ్వరి అన్నారు. గిరిజన టీచర్లకూ ఏకీకృత సర్వీస్ రూల్స్ వర్తింపు కోరుతూ వెంకయ్యకు వినతిపత్రం ఇవ్వాలా వద్దా అని తాము సంశయించి.. ఇదే విషయం అధినేత జగన్ దృష్టికి తీసుకువెళ్తే, వెంకయ్యనాయుడు గారికి ఇవ్వండమ్మా అని ఆయనే పురమాయించారని చెప్పారు.