సర్కారుపై ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ గిరిజన ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: పర్యాటకరంగం అభివృద్ధి పేరుతో ఏజెన్సీ ప్రాంతంలోని భూముల్ని డీ నోటిఫై చేసి బాక్సైట్ తవ్వకాలే రహస్య ఎజెండాగా ప్రభుత్వం ముందుకెళుతోందని వైఎస్సార్‌సీపీ గిరిజన ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి గిరిజనులంటే చిన్న చూపని, గిరిజనులంతా వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచి టీడీపీని ఆదరించనందునే వారి పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రం మొత్తం ఏడు గిరిజన అసెంబ్లీ సెగ్మెంట్లుంటే, ఆరు సెగ్మెంట్లలో వైఎస్సార్‌సీపీని గెలిపించినందునే ఏజెన్సీలోని సమస్యల పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీ మీడియా పాయింట్‌లో శుక్రవారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు, పీడిక రాజన్నదొర, రాజేశ్వరి, పుష్పశ్రీవాణి, విశ్వాసరాయి కళావతిలు విలేకరులతో మాట్లాడారు. గిరిజన ఎమ్మెల్యేలమైన తమపట్ల ఉదారంగా వ్యవహరించాల్సిన స్పీకర్ తమకు అవకాశం కూడా ఇవ్వడం లేదని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆవేదన వ్యక్తంచేశారు. అరకు, లంబసింగిలను టూరిజం కేంద్రాలుగా ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలని కోరితే సభలో అధికారపక్షం వ్యవహరించిన తీరు అవమానకరం గా ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రకృతిని ధ్వంసం చేసి బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వం రహస్య ఎజెండాతో ముందుకెళ్తుందని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఆరోపించారు.
అరకుపై అసెంబ్లీలో గొడవ, సభ వాయిదా
అంతకుముందు శాసనసభలో అరకును పర్యాటక కేంద్రంగా మార్చే వ్యవహారమై వాడివేడి చర్చ జరిగింది. గిరిజన ప్రాంతంగా ఉన్న అరకును డీ నోటిఫై చేసే ప్రతిపాదన లేదంటూనే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై వివాదం చెలరేగింది. దీనిపై మాట్లాడనీయకపోవడంతో వై సీపీ గిరిజన ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తంచేయగా స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
టూరిజం పేరుతో ఏజెన్సీపై కుట్ర
Published Sat, Sep 6 2014 2:58 AM | Last Updated on Tue, May 29 2018 3:35 PM
Advertisement
Advertisement