యూనోఫాం
అనంతపురం రూరల్: పరిధిలోని పాపంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6-8 తరగతుల విద్యార్థులు 181 మంది ఉన్నారు. వీరికి యూనిఫాం కోసం సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) క్లాత్ సరఫరా చేసింది. స్టిచ్చింగ్ మాత్రం కాలేదు. కుట్టు కూలి కూడా జమ చేయలేదు. తమకే కుట్టు బాధ్యత ఇవ్వాలని కొందరు పాఠశాల యాజమాన్యంపై ఒత్తిడి చేస్తున్నారు. దీనివల్లే పెండింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క పాఠశాలలోనే కాదు... జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇదే పరిస్థితి ఉంది. 2014-15 విద్యా సంవత్సరం సగం పూర్తయినా విద్యార్థులకు యూనిఫాం అందలేదు.
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలో 3,844 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 1-8 తరగతుల విద్యార్థులు 2,98,632 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు జతల ప్రకారం 5,97,264 జతల యూనిఫాం అవసరం. ప్రతియేటా ఎస్‌ఎస్‌ఏ ద్వారా యూనిఫాం పంపిణీ జరుగుతోంది. 1-7 తరగతుల బాలురకు చొక్కా,నిక్కరు, బాలికలకు చొక్కా, స్కర్టు, 8వ తరగతి బాలురకు చొక్కా, ప్యాంటు, బాలికలకు పంజాబీ దుస్తులు ఇస్తున్నారు.
ప్రతియేటా పాఠశాలల ప్రారంభం నాటికి విద్యార్థులందరికీ యూనిఫాం పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ నిబంధన. ఏ ఒక్క ఏడాదీ ఈ నిబంధన అమలు కాలేదు. ఈ విద్యా సంవత్సరంలో ఆర్నెళ్లు గడిచినా.. క్లాత్ అందని పాఠశాలలే చాలా ఉన్నాయి. క్లాత్ ఎప్పుడొస్తుందో, స్టిచ్చింగ్ ఎప్పుడు పూర్తవుతుందో, విద్యార్థులకు ఎప్పుడిస్తారో అర్థం కావడం లేదు.
క్లాత్ కొనుగోలు, కుట్టు నిధులు జమ చేశామని అధికారులు చెబుతున్నా..క్షేత్రస్థాయిలో మాత్రం నిధులు రాలేదని హెచ్‌ఎంలు అంటున్నారు. ఈసారి యూనిఫాం ఇవ్వని కారణంగా గతేడాది ఇచ్చిన వాటినే (చిరిగిపోయినవి, పాతవి) విద్యార్థులు వేసుకుని స్కూళ్లకు వెళుతున్నారు.
కమీషన్ల కోసం కక్కుర్తి
కుట్టుపై కొందరి గుత్తేదారుల కన్నుపడింది. నిబంధనలను తుంగలో తొక్కి కమీషన్లకు కక్కుర్తిపడున్నారు. కుట్టు కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అటు ప్రజాప్రతినిధులకు, ఇటు అధికారులకు కమీషన్ల ఆశచూపుతున్నారు. ప్రజాప్రతినిధులు కూడా ఒత్తిళ్లు చేస్తుండడంతో కొందరు ఎంఈఓలు ఆయా స్కూళ్ల హెచ్‌ఎంలను బలవంతంగా ఒప్పించి కుట్టు బాధ్యతలు అనుకున్నవారికే అప్పగిస్తున్నారు. దాదాపు అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి.
నాణ్యత కరువు
ఒక జత కుట్టేందుకు ప్రభుత్వం రూ.40 చెల్లిస్తోంది. ఇందులోనే దారం, గుండీల ఖర్చు, కుట్టుకూలితో పాటు సంబంధిత అధికారులకు కమీషన్ కూడా చెల్లించాల్సి వస్తోంది. ఇస్తోందే తక్కువ ధర. ఈ మొత్తంలోనే కమీషన్లు ఆశిస్తుండడంతో యూనిఫాం ఏమాత్రం నాణ్యతగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బిగుతుగా, నాసిరకంగా కుడుతున్నారు. ఎవరైనా పిల్లలు ప్రశ్నిస్తే వారి నోళ్లు మూయిస్తున్నారు.
డమ్మీలైన ఎస్‌ఎంసీలు
పాఠశాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు (ఎస్‌ఎంసీలు) చాలాచోట్ల డమ్మీగా మారాయి. వీటిని బలోపేతం చేస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం మినహా క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి లేదు. సంబంధిత పాఠశాల హెచ్‌ఎం ఇంటికి ప్రతిపాదనల ప్రతులు పంపితే వాటిలో గుడ్డిగా సంతకాలు చేయడంతోనే ఎస్‌ఎంసీ సభ్యులు సరిపెట్టుకుంటున్నారు.