వైవీబీ వర్సెస్ బోడే పెనంలూరు
టీడీపీలో గ్రూపుల కుంపటి
=నాలుగేళ్లుగా ఇన్‌చార్జిలే లేని దుస్థితి
=తీవ్ర నైరాశ్యంలో కార్యకర్తలు
=నేడు అధినేత వద్ద పంచాయితీ
=దిద్దుబాట పట్టేనా!?
ఉయ్యూరు, న్యూస్‌లైన్ : పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరుతో కుతకుతలాడుతోంది. పార్టీ అధికార ప్రతినిధి వైవీబీ రాజేంద్రప్రసాద్, దివంగత చలసాని పండు వర్గానికి చెందిన బోడే ప్రసాద్, వల్లభనేని వెంకటేశ్వరరావు(నాని)ల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. దీంతో నాలుగేళ్లుగా పార్టీ ఇన్‌చార్జినే నియమించలేని పరిస్థితి నెలకొంది. వైవీబీ, బోడేలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నారు. ఈ పంచాయితీ చివరకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వద్దకు చేరింది.
ఆయన దిద్దుబాటు చర్యలపై దృష్టిపెట్టారు. గురువారం రాజధానిలో ఈ నియోజకవర్గం పరిస్థితి, ఇన్‌చార్జి నియామకం తదితర అంశాలపై ముఖ్యనేతలతో ఆయన సమీక్ష జరపనున్నట్లు సమాచారం అందింది. ఈ వర్గపోరుతో టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు తీవ్ర నైరాశ్యంలోకి నెట్టబడ్డారు. ఇటీవల ఈ రెండు గ్రూపుల మధ్య పార్టీ పరిశీలకుడు సుజనా చౌదరి పంచాయితీ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడుగా పెనమలూరుకే పరిమితం కావాలని, ఇతర మండలాలకు వెళ్లి గందరగోళం సృష్టించవద్దని బోడేకు ఆయన సూచించారు. బోడే కొద్దిరోజుల పాటు మండలానికే పరిమితమయ్యారు.
ఈ పరిణామాలపై పండు వర్గీయులు బాలకృష్ణకు ఫిర్యాదుచేశారు. బోడే చేస్తున్న సేవా కార్యక్రమాల వల్ల పార్టీకి ప్రయోజనమే కదా, ఆపడమెందుకు అని బాలకృష్ణ సమర్థించారు. బోడే తన కార్యకలాపాలను ఉధృతం చేశారు. ఫలితంగా ఇంటిపోరు తారస్థాయికి చేరి పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోతోంది. ఈ నేపథ్యంలో వర్గపోరుకు చెక్‌పెట్టి నియోజకవర్గ ఇన్‌చార్జిని నియమించకపోతే పార్టీ పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఉందని జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమ అధినేతకు చెప్పడంతో అత్యవసరంగా ఈ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది.
ఇన్‌చార్జి నియామకం జరిగేనా!?
నియోజకవర్గంలో ఇప్పటికే మంత్రి సారథి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. జనవరి 2 నుంచి వైఎస్సార్ సీపీ గడపగడపకూ సమైక్యాంధ్ర ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో పార్టీకి ఇన్‌చార్జిని నియమించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని టీడీపీ భావిస్తోంది. అధినేత నుంచి పిలుపు రావడంతో ముఖ్యనేతలందరూ రాజధానికి పయనమయ్యారు. ‘వస్తున్నా.. మీ కోసం’లో భాగంగా కనుమూరు వద్ద నియోజకవర్గ పరిస్థితిపై సమీక్ష జరిపారు. ఇన్‌చార్జిని నియమించాలని పలువురు కోరారు. ఇంతవరకూ ఆ పనిచేయలేకపోయారు. కార్యకర్తలు గురువారం సమావేశంలోనైనా ఇన్‌చార్జిపై స్పష్టమైన ప్రకటన ఉంటుందో లేదోనన్న మీమాంసకు లోనవుతున్నారు. తెలంగాణ అంశంపై అధినేత ద్వంద్వ వైఖరిని కూడా పార్టీ దిగువస్థాయి కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ దిద్దుబాటు చర్య తీసుకున్నా పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడం ఓ సవాలేనని వారు భావిస్తున్నారు.