బాలికల వసతి గృహాల్లో.. | POOR FACILITIES IN GOVT GIRLS HOSTELS | Sakshi
Sakshi News home page

బాలికల వసతి గృహాల్లో..

Published Tue, Feb 6 2018 6:34 PM | Last Updated on Tue, Feb 6 2018 6:36 PM

POOR FACILITIES IN GOVT GIRLS HOSTELS - Sakshi

భద్రాచలం :  జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాల స్థాయి సెల్ఫ్‌ మేనేజ్‌మెంట్‌ హాస్టళ్లలో సమస్యలు గూడుకట్టుకున్నాయి. ఇంటర్, డిగ్రీ విద్యార్థుల కోసం హడావుడిగా వసతి గృహాలు ప్రారంభించినా.. మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని 10 (బాలురు –5, బాలికలు–5) ఎస్‌ఎం హాస్టళ్లలో సుమారు 750 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఇందులో కొత్తగూడెం మినహా మిగతా ఎక్కడా పక్కా భవనాలు లేవు. ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 23 ప్రీ మెట్రిక్‌ వసతి గృహాలు సైతం నిర్వహిస్తుండగా, వీటిలో 1615 మంది ఉంటున్నారు. వసతి గృహాల్లో చాలా చోట్ల సరైన వసతులు లేవు. ఈ సమస్యలను గుర్తించిన కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిధులు కేటాయించారు.

ప్రధానంగా బాలికల వసతి గృహాల్లో అవసరమైన చోట్ల యుద్ధప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించేందుకు రూ. 35.50 లక్షలు మంజూరు చేశారు. కానీ వాటిని సవ్యంగా వినియోగించక విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరమ్మతుల పేరిట వసతి గృహాలకు పైపైన రంగులు వేసి నిధులు దుర్వినియోగం చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పనులపై ‘సాక్షి’ పరిశీలన చేయగా, మరమ్మతుల్లో దాగి ఉన్న గమ్మత్తు వెలుగులోకి వచ్చింది.    

రూ.35.50 లక్షలతో పనులు...
వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలపై కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రీ మెట్రిక్‌ హాస్టళ్ల పరిధిలోనే ఎస్‌ఎం హాస్టళ్లను కూడా నిర్వహిస్తున్నందున, ఇక్కడ మౌలిక వసతులు మెరుగుపరిస్తే అందరికీ బాగుంటుందని భావించారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల  నివేదికల ఆధారంగా జిల్లాలోని ఏడు బాలికల వసతి గృహాల మరమ్మతుల కోసం రూ.35.50 లక్షలు మంజూరు చేశారు. అధికారులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం భద్రాచలం ఏ హాస్టల్‌కు రూ. 8.50 లక్షలు, బీ హాస్టల్‌కు రూ.4 లక్షలు, బూర్గంపాడుకు రూ.4.50 లక్షలు, మణుగూరుకు రూ.4.50 లక్షలు, పాల్వంచ రూ. 5 లక్షలు, ఇల్లెందు రూ. 4.50 లక్షలు, కొత్తగూడెం హాస్టల్‌కు రూ. 4.50 లక్షలతో మరమ్మతు పనులు చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఇంజనీరింగ్‌ శాఖ పర్యవేక్షణలో చేపట్టిన ఈ పనులన్నీ పూర్తయ్యాయని అధికారులు చెపుతున్నారు.  

అంతా వారిష్టమే..
హాస్టళ్లలో చేపట్టిన పనులన్నీ ఎస్సీ కార్పొరేషన్‌ ఇంజనీరింగ్‌ అ«ధికారులు ఇష్టానుసారమే చేసినట్లుగా తెలుస్తోంది. వసతి గృహాల అధికారుల నివేదికలను పక్కన పెట్టి, వారికి ఇష్టమొచ్చిన రీతిలో పనులు చేశారు. భద్రాచలంలోని బాలికల బీ హాస్టల్‌లో ప్రహరీ నుంచి  హాస్టల్‌ బిల్డింగ్‌ వరకు సీసీ రోడ్‌ వేయాలని హెచ్‌డబ్ల్యూవో నివేదిక ఇవ్వగా, ఇంజనీరింగ్‌ అధికారులు మాత్రం హాస్టల్‌ ప్రాంగణంలో పూలమొక్కల మధ్యలో ఫ్లోరింగ్‌ పనులు చేశారు. అక్కడ అవసరం లేకున్నా, ఏదో రీతిన నిధులు ఖర్చు చేసేందుకు కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన ఇంజనీరింగ్‌ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. మిగతా చోట్ల కూడా ఇదే రీతిన చేశారనే విమర్శలు ఉన్నాయి. పైపైన పనులు చేసి, చేతులు దులుపుకున్నారని కొందరు హెచ్‌డబ్ల్యూఓలు అంటున్నారు.  

బిల్లుల చెల్లింపులో జాప్యమెందుకో...
వసతి గృహాల్లో మరమ్మతు పనులు పూర్తి చేసి రెం డు నెలలకు పైనే అయిందని ఆ శాఖ అధికారులు చెపుతున్నారు. కానీ ఇప్పటివరకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై  అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్‌ అధికారులకు మధ్య కమీషన్‌ ఒప్పందాలు కుదరకపో వడమే కారణమనే ప్రచారం జరుగుతోంది. కాగా, రిపేర్‌ పనులు పూర్తయినట్లు సంబంధిత హాస్టల్‌ ఇన్‌చార్జీలు ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి. ఆయా ప్రాంతాలకు చెందిన ఏఎస్‌డబ్ల్యూవోలు పనులు తనిఖీ చేసి నిర్ధారించాలి. కానీ ఇప్పటి వరకు హెచ్‌డబ్ల్యూవోలు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదని సమాచారం. ఈ వ్యవహారంపై కలెక్టర్‌ పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.

ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదు
మరమ్మతు పనులకు సంబంధించి ఇంజనీరింగ్‌ శాఖ వారికి ఇంకా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదు. హెచ్‌డబ్ల్యూవోల నివేదిక కూడా నాకు అందలేదు. వారి ధ్రువీకరణ ఆధారంగా  పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే బిల్లుల చెల్లింపునకు సిఫార్స్‌ చేస్తా. పనులు కూడా ఇంకా కొన్ని అసంపూర్తిగా ఉన్నట్లు తెలిసింది. దీనిపై పరిశీలన చేస్తా.  
– నతానియేల్, డివిజనల్‌ సాంఘిక సంక్షేమ అధికారి


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement