కోటి బ్యాంకు ఖాతాల్ని పరిశీలించిన ఐటీ శాఖ
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లోకి చేరిన లెక్కలు చూపని ఆదాయాన్ని పట్టుకునే పనిని ఆదాయపన్ను శాఖ (ఐటీ) వేగిరం చేసింది. ఇప్పటికే కోటికి పైగా బ్యాంకు ఖాతాల వివరాల పరిశీలనను, వాటిని పన్ను చెల్లింపుదార్ల వివరాలతో పోల్చి చూసే పనిని పూర్తి చేసింది. గతేడాది నవంబర్ 10 – డిసెంబర్ 30 మధ్య కాలంలో రూ.5 లక్షలకు పైబడి సందేహాస్పద డిపాజిట్లకు సంబంధించి మూలాలు తెలియజేయాలని కోరుతూ ఇప్పటికే 18 లక్షల మందికి సందేశాలు పంపినట్టు సమాచారం. ఐటీ శాఖ రికార్డుల ప్రకారం 3.65 కోట్ల మంది వ్యక్తులు, 7 లక్షల కంపెనీలు, 9.40 లక్షల హిందూ అవిభాజ్య కుటుంబాలు, 9.18 లక్షల సంస్థలు 2014–15 సంవత్సరంలో ఐటీ రిటర్నులు దాఖలు చేశాయి.