12% పెరగనున్న డిజిటల్‌ విద్య | 12% increase digital education | Sakshi
Sakshi News home page

12% పెరగనున్న డిజిటల్‌ విద్య

Published Sat, Apr 14 2018 12:22 AM | Last Updated on Fri, Sep 28 2018 3:58 PM

12% increase digital education - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం దేశంలో ఎడ్యుకేషన్‌ మార్కెట్‌ విలువ 97.8 బిలియన్‌ డాలర్లు కాగా దాన్లో డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ వాటా రెండు బిలియన్‌ డాలర్లకు చేరిందని ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ సిస్కో ఇండియా, సార్క్‌ కమర్షియల్‌ సేల్స్‌ ఎండీ సుధీర్‌ నాయర్‌ చెప్పారు. రెండేళ్లలో డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ 11 నుంచి 12 శాతం మేర వృద్ధి సాధించే అవకాశం ఉందన్నారు. ఇక్కడి ఐఎస్‌బీ ప్రాంగణంలో ‘బ్లూ ప్రింట్‌ ఫర్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో సిస్కో సంస్థ పలు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా సుధీర్‌ నాయర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం డిజిటలైజేషన్‌ ప్రభావానికి గురవుతున్న 14 రంగాల జాబితాలో విద్యా రంగం ఏడో స్థానంలో ఉందని, దీన్ని బట్టే విద్యా రంగంలో డిజిటల్‌ నైపుణ్యాలు పెంచుకోవాల్సిన ఆవశ్యకత వెల్లడవుతోందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే తాము పలు సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్ట్‌లను రూపొందించినట్లు తెలియజేశారు. ‘‘దీన్లో స్పార్క్‌ యాప్‌ విభిన్నమైనది. దీని ద్వారా విద్యార్థులకు వర్చువల్‌ క్లాస్‌ రూమ్స్, లెక్చర్స్‌ అరచేతిలో అందుబాటులోకి వస్తాయి’’ అన్నారాయన.

తెలంగాణ ప్రభుత్వంతోనూ ఒప్పందం:
డిజిటల్‌ ఎడ్యుకేషన్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ కోణంలో తెలంగాణ ప్రభుత్వంతోనూ ఒప్పందం చేసుకున్నట్లు ఈ సందర్భంగా సుధీర్‌ చెప్పారు. ‘‘ఈ ఒప్పందంలో భాగంగా టి–హబ్‌ ప్రాంగణంలో ఇన్నోవేషన్‌ హబ్, లివింగ్‌ ల్యాబ్‌లను నెలకొల్పాం. హైటెక్‌ సిటీ ప్రాంతంలో 2.2. కి.మీ. మేర డిజిటల్‌ జోన్‌ ప్రాజెక్ట్‌ను రూపొందించాం. దీనిలో భాగంగా స్మార్ట్‌ వై–ఫై, స్మార్ట్‌ లైటింగ్, ట్రాఫిక్‌ ఎనలిటిక్స్, స్మార్ట్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి’’ అని వివరించారు. డెలివరింగ్‌ రిమోట్‌ ఎడ్యుకేషన్‌ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌ జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో నెలకొన్న పది పాఠశాలల్లో వర్చువల్‌ క్లాస్‌ రూమ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement