హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో అతిపెద్ద ఆటో ఎక్స్‌పో ‘2018 మోటార్ షో’ ఫిబ్రవరి 7 నుంచి (9 నుంచి సందర్శకులకు అనుమతి) ప్రారంభమవుతోంది. గ్రేటర్ నోయిడా వేదికగా ఫిబ్రవరి 14 వరకు జరుగుతుంది. 25–30 కొత్త మోడళ్లు ఈ ప్రదర్శనలో తళుక్కుమంటాయి.
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్), ఆటోమోటివ్ కంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్, సీఐఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తొలిరోజున మీడియా సమక్షంలో కొత్త మోడళ్ల ఆవిష్కరణ చేపడుతున్నట్టు సియామ్ ట్రేడ్ ఫెయిర్ గ్రూప్ చైర్మన్ అరుణ్ మల్హోత్రా చెప్పారు. 20 దేశాల నుంచి 1,200 పైచిలుకు కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవలను దీన్లో ప్రదర్శిస్తాయి. వీటిలో టెక్నాలజీ ఆధారిత కంపెనీలు 20 దాకా ఉంటాయని, ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తూ ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేశామని మల్హోత్రా తెలిపారు.
అమ్మకాలకు ఫైనాన్స్ దన్ను..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో 2 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహనాలు, 35 లక్షల ప్యాసింజర్ వెహికల్స్ అమ్ముడవుతాయని అంచనా వేస్తున్నట్టు అరుణ్ మల్హోత్రా తెలిపారు. ‘చిన్న పట్టణాల నుంచి అధిక వృద్ధి నమోదవుతోంది. మారుమూల ప్రాంతాల్లో కూడా విరివిగా ఫైనాన్స్ లభ్యత వాహన పరిశ్రమను నడిపిస్తోంది. 100 శాతం వాణిజ్య వాహనాలు, 80 శాతం ప్యాసింజర్, 45 శాతం దాకా ద్విచక్ర వాహనాలు ఫైనాన్స్ ద్వారానే కస్టమర్ల చేతుల్లోకి వస్తున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చే విషయంలో దాదాపు అన్ని కంపెనీలు సీరియస్‌గా నిమగ్నమయ్యాయి’ అని వివరించారు. పన్నులన్నీ జీఎస్టీ పరిధిలోకి వచ్చాయనుకోవడానికి వీల్లేదని అన్నారు. రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ ఇంకా అమలవుతున్నాయని, ఇవి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నాయని గుర్తు చేశారు. కాగా, రోజుకు లక్ష మందికిపైగా ఎక్స్‌పో సందర్శనకు వస్తారని భావిస్తున్నట్టు సియామ్ డైరెక్టర్ దేబశిష్ మజుందార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment